– భూతల్లి ఒడిని చేరిన అరుణ కిరణం
– కామ్రేడ్ కట్ట గాంధీ మీకు వేల వేల వందనాలు.. జోహార్లు
నవతెలంగాణ – కల్లూరు
మధిర పట్టణానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు( మార్కిస్ట్) యోధుడు కామ్రేడ్ కట్టా గాంధీ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ స్వగ్రామం పోచారంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈయనకు భార్య ఇరువురు కుమారులు ఉన్నారు. కమ్యూనిస్టు ( మార్కిస్ట్)పార్టీ నాయకునిగా కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాలకు అండగా వారి సమస్యల పరిష్కారానికి మూడు దశాబ్దాలకు పైగా కృషి చేశారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు సిపిఎం పార్టీకి ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్ గా ఐదేళ్లపాటు సేవలoదించారు. సోదరుడు కట్ట వెంకట నరసయ్య శాసనసభ్యులుగా పనిచేసిన కాలంలో ఈ ప్రాంత సమస్యలపై ప్రజల మాటలు తన గొంతు గా ప్రజాప్రతినిధి గా ఉన్న వెంకట నర్సయ్య గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడంలో ముందడుగు లో ఉండేవారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నాటి పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు తన భావజాలాన్ని అమలుపరచడంలో కట్ట గాంధీకి ప్రత్యేక పేరు ఉంది.
మారిన రాజకీయ పరిణామాలు పార్టీ నిర్మాణాత్మక విషయాలలో నెలకొన్న పరిస్థితులు ఇతర అంశాల నేపథ్యంలో చివరి కాలంలో పార్టీ కార్యకర్తగా నే కొనసాగిన ఆయన కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితులు అవరోధంగా మారడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. చివరి దశలో ఆయన సేవలను పార్టీ వినియోగించుకోలేదన్న ఆవేదన ఆయన అంతర్మదనంలో నిడిచిపోయింది. ప్రజాసేవలో నిలిచిన కట్ట వెంకట నరసయ్య వలె ఆయన సోదరుడు కట్ట గాంధీ కూడా అంతరాత్మ సాక్షిగా కమ్యూనిస్టు గానే తుది శ్వాస విడవడం వారి సైదాంతిక నిబద్ధతకు నిదర్శనం… అందరూ మహానుభావులను కన్న మధిర గడ్డ మరెందరో కమ్యూనిస్టు నేతలకు ఆశ్రయం కల్పించిన మధిర చరిత్రలో అరుణ కిరణంగా నిలిచిన కట్ట గాంధీ గారు ఇక లేరన్న వార్త నాటి భావజాలం కమ్యూనిస్టు నాయకులకు ఈ ప్రాంత ఆయన ఆత్మీయులకు తీరని లోటు.. కమ్యూనిస్టుగా పుట్టడమే ఒక చరిత్ర… తుది వరకు కమ్యూనిస్టు గా జీవించడం ప్రజల జీవితాల కోసం పోరాడడం ఓ ఆత్మీయ సంతృప్తి… అంతిమంగా కమ్యూనిస్టుగా తుది శ్వాస విడవడం చరిత్రలో తనకంటూ ఓ స్థానం నిలుపుకోవడం కట్ట గాంధీ కి దక్కిన గౌరవం.



