నవతెలంగాణ-హైదరాబాద్: నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2025లో అమెరికా లక్షకు పైగా వీసాలను రద్దు చేసింది. వాటిలో సుమారు 8,000మంది విద్యార్థుల వీసాలు ఉన్నాయి. ”అమెరికాను సురక్షితంగా ఉంచే చర్యల్లో భాగంగా మేము ఈ నేరస్తులను బహిష్కరిస్తూనే ఉంటాము” అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ”విదేశాంగశాఖ ఇప్పుడు లక్ష వీసాలను రద్దు చేసింది. వాటిలో సుమారు 8,000 విద్యార్థి వీసాలు మరియు నేరపూరిత కార్యకలాపాలకు సంబంధించి అమెరికా చట్ట అమలు సంస్థల విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తులకు చెందిన 2,500 ప్రత్యేక వీసాలు కూడా ఉన్నాయి” అని పేర్కొంది.
ఏడాది కంటే తక్కువ సమయంలో ట్రంప్ యంత్రాంగం లక్ష వీసాలను రద్దు చేసిందని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్‌పర్సన్ టామీ పిగోట్ పేర్కొన్నారు. దాడి, దొంగతనం మరియు మద్యం సేవించి వాహనం నడపడం వంటి నేరాలకు పాల్పడిన వారు లేదా దోషులుగా తేలిన వేలాది మంది విదేశీ పౌరుల వీసాలు కూడా ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు. రద్దైన ప్రత్యేక వీసాల్లో సగం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కాగా, 30శాతం దాడి, నిర్బంధ ఆరోపణలు, మిగిలిన 20శాతం దొంగతనం, చిన్నారులపై వేధింపులు, డ్రగ్స్ వినియోగం మరియు పంపిణీ, మోసం మరియు అపహరణ ఆరోపణలకు సంబంధించినవి ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికాను అగ్రస్థానంలో నిలపడమే ట్రంప్ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజా భద్రత మరియు జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించే విదేశీ పౌరుల నుండి దేశాన్ని కాపాడనున్నట్లు తెలిపారు.
రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వలసలపై అణచివేతను తీవ్రతరం చేసింది. వృత్తులు, అధ్యయనానికి సంబంధించిన వీసాలపై నిబంధనలను కఠినతరం చేసింది. డిసెంబర్ 15 నుండి యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్.. సోషల్‌మీడియా ప్రొఫైల్స్ తనిఖీలు సహా హెచ్1బి, హెచ్-4 వీసా దరఖాస్తులపై పర్యవేక్షణ ప్రారంభించింది. భారత్‌లో షెడ్యూల్ చేయబడిన హెచ్-1బి వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. చాలా మంది దరఖాస్తులు స్టాంపింగ్ కోసం నెలల తరబడి నిలిచిపోయిన సంగతి తెలిసిందే.



