నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జరిగిన గిగ్ కార్మికుల సమ్మె ఈరోజు విజయవంతంగా ముగిసింది. డెలివరీ బాయ్‌లను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ప్రభుత్వ జోక్యం తర్వాత, ఆన్‌లైన్ ఆర్డర్‌లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనను అన్ని ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు ఎత్తివేశాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా జోక్యం తర్వాత, బ్లింకిట్ తన అన్ని బ్రాండ్‌ల నుంచి 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్‌ను తొలగించింది.
ఈ సమ్మె విషయంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డెలివరీ భాగస్వాముల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, సమయ పరిమితులను తొలగించడం గురించి చర్చించారు. వేగవంతమైన డెలివరీ ఒత్తిడి కారణంగా డెలివరీ బాయ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని ప్రభుత్వం కంపెనీలకు స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఈ సమావేశం తర్వాత అన్ని కంపెనీలు తమ బ్రాండ్ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్ట్‌ల నుంచి 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చాయి.
నిజానికి 10 నిమిషాల సమయ పరిమితి.. డెలివరీ బాయ్స్‌పై త్వరగా డెలివరీ చేయాలనే ఒత్తిడి తీసుకొస్తుంది. దీంతో వారు త్వరగా డెలివరీ ఇవ్వాలనే తొందరలో రోడ్డు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఈ10 నిమిషాల డెలివరీ సమయ పరిమితి అనేది ఎత్తివేయాలని డిసెంబర్ 31 రాత్రి దేశవ్యాప్తంగా గిగ్ కార్మికులు సమ్మె చేశారు. ఈ సందర్భంగా డెలివరీ బాయ్స్ తమ భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటన తర్వాత, ప్రభుత్వం ఆయా కంపెనీలతో మాట్లాడి డెలివరీ బాయ్స్ భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతనే వేగం అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.



