నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్‌లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనల్లో భద్రతా సిబ్బందితో సహా దాదాపు 2,000 మంది మరణించినట్లు ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం ఇంత పెద్ద సంఖ్యలో మరణాలను అంగీకరించడం ఇదే మొదటిసారి.
దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం, స్థానిక కరెన్సీ (రియాల్) విలువ పడిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. డిసెంబర్ 28, 2025న తెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్‌లో మొదలైన ఈ నిరసనలు, అనతికాలంలోనే దేశంలోని 31 రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ మరణాలకు ఉగ్రవాదులే కారణమని, వారే ప్రజలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని సదరు అధికారి ఆరోపించారు.
ఈ అల్లర్ల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.



