– ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
నవతెలంగాణ -పరకాల
పరకాల పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం తప్పింది. స్థానిక సంజయ్ గ్లాస్ మార్ట్ యజమాని గోరంటల సంజయ్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోరంటల సంజయ్ కుటుంబ సమేతంగా వేములవాడ జాతరకు వెళ్లారు. మంగళవారం రాత్రి వారు తిరిగి వచ్చి ఇంటి తలుపులు తీసే క్రమంలో, లోపలి నుండి దట్టమైన పొగలు వెలువడడాన్ని గమనించారు. లోపల మంటలు వ్యాపిస్తున్నాయని గుర్తించిన సంజయ్, వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వంటగదిలోని ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కావడంతోనే మంటలు మొదలైనట్లు అధికారులు గుర్తించారు. మంటలు మరింత విస్తరించకుండా కరెంట్ కనెక్షన్‌ను నిలిపివేసి, గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వంటగదిలో గ్యాస్ సిలిండర్లు ఉన్న సమయంలోనే మంటలు చెలరేగడం గమనార్హం. ఒకవేళ సంజయ్ కుటుంబం జాతర నుండి సకాలంలో ఇంటికి చేరుకోకపోయినా, లేదా మంటలు సిలిండర్లకు వ్యాపించినా భారీ పేలుడు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



