- ఈఎన్టి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య
నవతెలంగాణ-సూల్తాన్ బజార్: నిషేధిత మాంజా గాజు పూతతో కూడిన ప్లాస్టిక్ దారం, ఇది మనుషులకు (ముఖ్యంగా బైకర్లకు) ప్రాణాంతకమైన గాయాలు చేస్తుందని, ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోఠి ఈఎన్టి (చెవి, గొంతు, ముక్కు ) ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ ఆచార్య సూచించారు. మంగళవారం కోఠి ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల గోల్డెన్ జూబ్లీ బ్లాక్ లోని ఆయన చాంబర్లో మాట్లాడుతూ.. చైనా మాంజా గాజు పూతతో ఉంటుంది కాబట్టి, మెడకు తగిలితే లోతైన కోతలు, రక్తనాళాలు తెగడం వంటి ప్రాణాంతక గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు.
ప్రజలు, యువత బైక్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.నిషేధిత మాంజాతో గాయాలకు గురైతే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు. కోఠి ఈ ఎన్ టి దవఖాన లో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మాంజాతో ప్రమాదానికి గురైతే రక్తస్రావాన్ని అరికట్టడానికి, రక్తనాళాలను సరిచేయడానికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం కావచ్చు అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ద్విచక్ర వాహనాల కు ముందు భాగంలో భద్రతా వైర్లను (safety wires) అమర్చుకోవాలి, తద్వారా మాంజా మెడకు తగలకుండా వైర్ పైనుంచి వెళ్తుంది అని తెలిపారు.మెడ రక్షణ: మెడ చుట్టూ స్కార్ఫ్, నెక్ ప్రొటెక్టర్స్ ధరించాలి అన్నారు.చేతులకు రక్షణ: గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించాలి అని సూచించారు.పండుగ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడం అందరి బాధ్యత అని అన్నారు.



