బీఆర్‌ఎస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌టీపీ నేతలు

బీఆర్‌ఎస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌టీపీ నేతలునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైఎస్‌ఆర్‌టీపీ నేత గట్టు రాంచందర్‌రావు నాయకత్వంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు, అన్ని జిల్లాల కో-ఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సోమవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌టీపీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి వచ్చిన నాయకులను స్వాగతిస్తుమన్నారు. తండ్రి సమానులైన కేసీఆర్‌ని రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు తన సొంత ఎజెండా కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిళ అని విమర్శించారు. మన రాష్ట్ర పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకునేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. కర్నాటకలో రైతులు రోడ్లమీదకొచ్చి ఆందోళన చేస్తున్నారనీ, కాంగ్రెస్‌ పార్టీ కేవలం మూడు గంటల కరెంటునే ఇచ్చి రైతుల ఉసురు పోసుకుంటున్నదని విమర్శించారు. రైతులకు రైతుబంధు దండగ అని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారనీ, తెలంగాణ ఉద్యమాన్ని కూడా వారు ఇలాగే అవహేళన చేశారని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కూడా అవహేళన చేసే విధంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రానికి బియ్యం కావాలని తెలంగాణను అడుగుతున్నారంటే అక్కడ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో 50కిపైగా స్థానాల్లో బలమైన అభ్యర్థులే లేని పరిస్థితి ఉందని విమర్శించారు. తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌నే అధికారంలోకి వస్తుందని నొక్కి చెప్పారు.

Spread the love