నవతెలంగాణ-కామారెడ్డి: మాచారెడ్డి మండలం సోమర్‌పేట్ గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 27 జట్లు పాల్గొనగా, ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.సెమీ ఫైనల్‌లో మాచారెడ్డి జట్టు తృతీయ బహుమతి రూ.4,000 గెలుచుకోగా, ద్వితీయ బహుమతి రూ.6,000ను షాబ్దీపూర్ జట్టు సొంతం చేసుకుంది.
ఫైనల్‌లో షాబ్దీపూర్‌ను ఓడించిన సోమర్‌పేట్ నవీన్ టీం ప్రథమ బహుమతి రూ.8,000తో పాటు కప్‌ను గెలుచుకుంది. క్రీడాకారుల భద్రత కోసం మ్యాట్ ఏర్పాటు చేయాలని కోరగా, నర్సింగ్ రావు రూ.1.50 లక్షల సహాయం చేస్తానని ప్రకటించారు.భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొనగా, పాఠశాల బాలికల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి



