నవతెలంగాణ – ఆలేరు రూరల్
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని సోమవారం( రేపు)నుంచి నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు.ఆలేరు మండలంలోని కొలనుపాక, గొలనకొండ,ఆలేరు,పటేల్ గూడెం రైతు వేదికల్లో ఏర్పాట్లు నిర్వహిస్తున్న అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించబడుతోందని తెలిపారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని, రైతులకు గోధుమ, వరి మరియు ఇతర పంటల సాగు పద్ధతులు,ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాటించాల్సిన వ్యవసాయ విధానాలపై వివరాలు తెలియజేయనున్నారు. అలాగే పంటల పరిరక్షణ, నీటి సమర్థ వినియోగం, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇదే సందర్భంలో రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీ పథకాలు, రైతు బీమా, పంట రుణాలపై పూర్తి సమాచారం అందించబడుతుంది. పంచాయతీ స్థాయిలో రైతులకు లభ్యమయ్యే సేవలు, ప్రభుత్వ సహాయం పొందే విధానం గురించి కూడా అధికారులు వివరించనున్నారు.ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు చురుకుగా పాల్గొనాలని అధికారులు కోరారు. రైతులు ఉదయం 08:30 గంటలకు సమీపంలోని రైతు వేదికలకు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే సమాచారం అందించడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కార మార్గాలను సూచించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.



