– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్: వైరా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం, ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలు జరగాలంటే చట్టసభల్లో ప్రజల తరఫున మాట్లాడే కమ్యూనిస్టులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు వైరా నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రాన్ని గెలిపించాలని బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం) వైరా పట్టణ సభ్యుల సమావేశం చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన బోడేపుడి భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసింది ఎమి లేదన్నారు. వైరా ప్రాజెక్టు సాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయని, ప్రస్తుతం ప్రాజెక్టు కింద 20,000 ఎకరాల్లో సాగులో ఉన్న వారి పొట్ట దశకి వచ్చిందని, నీళ్లు అందక చివరి భూములు ఎండిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. వైరా నియోజకవర్గంలో కొణిజర్ల, కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూర్ మండలాల్లో 80 శాతం ఉన్న పోడు రైతుల సమస్య తీవ్రంగా ఉందని, పోడు పట్టాలు ఎన్నికలు వస్తేనే ప్రభుత్వాన్ని గుర్తుకొచ్చే పరిస్థితి ఉందని, గిరిజన యూనివర్సిటీ హామీలు అలాగే మిగిలి ఉన్నాయని తెలిపారు. వైరా నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నాడే ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా మారుస్తామని శంకుస్థాపన చేసి శిలాఫలకం లేసి వదిలేసారని, గత పది సంవత్సరాలు కాలంలో ప్రభుత్వం ప్రకటించిన హామీలు నామమాత్రంగా కూడా అమలుకు ప్రభుత్వం ప్రయత్నించ లేదని అన్నారు. వైరా నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కమ్యూనిస్టులే వైరా సమస్యల పరిష్కారానికి సరైన దిక్సూచి అంటున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి సీపీఐ(ఎం) పార్టీ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై తమ ఓటు వేయాలని అడగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, నాయకులు బొంతు సమత, గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరావు, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, మాడపాటి మల్లికార్జున్, అనుమోలు రామారావు, రాచబంటి బత్తిరన్న, గుడిమెట్ల మోహన్ రావు, గుమ్మా నరసింహారావు, షేక్ జమాల్, మల్లెంపాటి ప్రసాదరావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, తోట కృష్ణవేణి, ఓర్పు సీతారాములు తదితరులు పాల్గొన్నారు.