– ఐద్వా అఖిలభారత ఆహ్వాన సంఘం
– గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతీయ సమాజంలో మహిళల పై హింస, లైంగిక వేధింపులు ఆగాలంటే కఠినమైన చట్టాలతోపాటు సామాజిక వ్యవస్థలో మార్పు రావాలని ఐద్వా అఖిల భారత మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ మహాసభలు ఈనెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణమండపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జాతీయ మహాసభల ప్రచార బెలూన్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ నాలుగు రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు ఐద్వా జాతీయ నాయకులు బృందాకరత్, శ్రీమతి టీచర్, మరియం ధావలె, పుణ్యవతి హాజరవుతారని చెప్పారు. మహిళా సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్టు వివరించారు. మహాసభల సందర్భంగా నగరాన్ని తోరణాలతో అలంకరిస్తున్నట్టు తెలియజేశారు. మహాసభలకు మహిళలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈనెల 25న ఐస్భవన్ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందని, సభకు వేలాదిగా మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు హింస సమాజానికి సవాల్ విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. మేజర్లయిన యువతి యువకులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కాలరాస్తూ కుల దురహంకార హత్యలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికాన్ని ఆసరా చేసుకొని అద్దె గర్భాల వ్యాపారం పేచ్చరిల్లిపోతున్నదన్నారు. పేదల నడ్డి విరుస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయని గుర్తు చేశారు. లక్షల సంఖ్యలో ఉన్న డ్వాక్రా మహిళల సమస్యలు విభిన్నరూపాల్లో ముందుకొస్తున్నాయని వివరించారు. మీడియాలో స్త్రీలను అసభ్యంగా అశ్లీలంగా చిత్రీకరించడంతోపాటు అందాల పోటీల పేరుతో ఆమెను మార్కెట్ సరుకుగా దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సమాజంలో మహిళల పై హింస, లైంగిక వేధింపులు ఆగాలంటే కఠినమైన చట్టాలతోపాటు సామాజిక వ్యవస్థలో మార్పు రావాలన్నారు. నయా ఉదారవాదం పెంచి పోషిస్తున్న వినిమయ సంస్కృతిపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. ఆశాలత, ప్రజాసంఘాల నాయకులు ఆబ్బాస్, టీ సాగర్, భూపాల్, శ్రీరామా నాయక్, వెంకట్ రాములు, మూడు శోభన్, ఉడుత రవీందర్, కోట రమేష్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలపై హింస లైంగికవేధింపులు ఆగాలంటే..సామాజికంగా మార్పు రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



