నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీఐ ద్వారా ఈపీఎఫ్‌ను (EPF) విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చందాదారులకు అందుబాటులోకి రానుంది. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకునే విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం చందాదారులు పీఎఫ్ విత్‌డ్రాకు క్లెయిమ్ ఫారాలు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త విధానంలో క్షణాల్లో నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
పీఎఫ్ మొత్తంలో కొంత భాగాన్ని మినహాయించి.. మిగిలిన నగదును విత్‌డ్రాకు అందుబాటులో ఉంచుతారు. ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత నగదు ఉపసంహరించుకోవచ్చో చూసుకోవచ్చు. యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఆ నగదును బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒకసారి బ్యాంకు ఖాతాలోకి వచ్చాక యూపీఐ ద్వారా నగదును తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. లేదంటే డెబిట్‌కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం సజావుగా అమలు చేయడానికి గానూ సాఫ్ట్‌వేర్ సమస్యలను తొలగించడంపై ఈపీఎఫ్‌ఓ దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.



