Monday, May 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీ మార్క్‌ ట్రేడ్‌..

మోడీ మార్క్‌ ట్రేడ్‌..

- Advertisement -

సామాన్యులపై పరోక్ష పన్నుల పోటు

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంచి హోటల్‌ తిండిని లగ్జరీ చేసిన వైనం దారిమళ్లుతున్న డొమెస్టిక్‌ సిలిండర్లు…మళ్ళీ షాటేజ్‌ డీజిల్‌దీ అదే దారి…
పెరిగిన బల్క్‌ రేట్‌ రిటైల్‌బంకులపై పడిన బల్క్‌ వినియోగదారులు
నేడో రేపో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తద్వారా పెరగనున్న అన్ని వస్తువుల ధరలు

ధరల పెరుగుదల ఖాయం
ఇక పెట్రోల్‌, డీజిల్‌ వంతు
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మోడీ సర్కార్‌ సంయమనం పాటించింది. ఆ రాష్ట్రాల్లో చివరి దశ పోలింగ్‌ ముగియగానే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను కనీవినీ రీతిలో పెంచేసి, కామన్‌మ్యాన్‌ జేబును కొల్లగొట్టేసింది. సోమవారం ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నా యి. ఆ వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదే జరిగితే సామాన్యుడి జేబు మరింత గుల్ల కావడం ఖాయం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు ప్రభావం నేరుగా రవాణా రంగంపై తీవ్రప్రభావం చూపుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఉప్పు, పప్పులు సహా అన్నింటి ధరలు ఆకాశానికి చేరడం ఖాయం. దీనివల్ల కామన్‌మ్యాన్‌ నెలవారీ బడ్జెట్‌ తలకిందులు అవుతుంది. ఆదాయానికి ఖర్చుకు మధ్య భారీ ఆర్థిక అంతరం ఏర్పడుతుంది.

”వ్యాపారం చేయడం ప్రభుత్వం పనికాదు” 2021 ఫిబ్రవరి 24న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (డీఐపీఏఎమ్‌) వెబినార్‌లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలివి. ఆ తర్వాత 2022లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వ్యాపారం చేయడం ప్రభుత్వం పనికాదు. విధానాలు రూపొందించడమే దాని పని’ అని కొనసాగింపునిచ్చారు. ఆ తర్వాత అనేక వేదికలపై ఇవే సుద్దులు వల్లించారు. ఈ విధానాల రూపకల్పనలోనే ‘మోడీ మార్క్‌ ట్రేడ్‌’ స్పష్టంగా కనిపిస్తుంది. అదానీ, అంబానీలకే కాదు… స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో అమెరికాకు కూడా అనుకూలమైన విధానాలను రూపొందించి దేశ సంపదను వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారడంలో సందేహం ఏమీ లేదు!

గ్యాస్‌ గోస…
తాజాగా మోడీ సర్కార్‌ వాణిజ్య సిలిండర్‌ ధరను ఒకే నెలలో ఏకంగా రూ.997కు పెంచేంసింది. దీనితో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర దేశవ్యాప్తంగా రూ.3 వేలకు పైగా పెరిగిపోయింది. ఫలితంగా హోటళ్లు, హాస్టళ్లు సహా అన్నింటి ధరలు ఆకాశానికి చేరాయి. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై టిఫిన్‌ సెంటర్లు నడుపుకొనే సామాన్యులు బావురుమంటున్నారు. ఇప్పుడు హోటల్‌లో టిఫిన్‌ చేయడం ‘లగ్జరీ’గా మారిపోయింది. తాము డొమెస్టిక్‌ సిలిండర్ల ధరను పెంచలేదని మోడీ భజనపరులు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడే ‘మోడీ మార్క్‌ ట్రేడ్‌’ స్పష్టంగా కనిపిస్తున్నది. డొమెస్టిక్‌, కమర్షియల్‌ సిలిండర్ల మధ్య దాదాపు రూ.2 వేలకు పైగా ధర వ్యత్యాసం ఉంది. డొమెస్టిక్‌ సిలిండర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. గ్యాస్‌ ఏజెన్సీలు, గోడౌన్ల వద్ద క్యూలైన్లలో కనిపిస్తున్న వినియోగదారులే దీనికి సాక్ష్యం. చిరువ్యాపారులు ఎక్కడైనా డొమెస్టిక్‌ సిలిండర్‌ను వినియోగిస్తే, విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. ఆ పరిహారం చెల్లింపు ద్వారానూ ప్రభుత్వానికి లాభమే. ఎటుతిరిగి మోడీ సర్కారు టార్గెట్‌ సామాన్యుడే!

మానసికంగా సిద్ధం చేయడమే!
అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపుతోంది. కానీ యుద్ధానికంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు బ్యారెల్‌ ధరలు భారీగా తగ్గినప్పుడు పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్క పైసా కూడా తగ్గించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ వర్గాల ద్వారానే చమురు ధరల పెంపు తప్పదనే సంకేతాలను కేంద్రం ఇప్పటికే ఇచ్చేసిందనే ప్రచారం జరుగుతోంది.

దారిమళ్లిన డీజిల్‌
ఇప్పటికే డీజిల్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడానికి మోడీ సర్కారు చర్యలే కారణం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం వల్ల దేశంలో డీజిల్‌ బల్క్‌, రిటైల్‌ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. లీటరుకు రూ.50కు పైగా ధరలో తేడా ఏర్పడింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఢిల్లీలో బల్క్‌ వినియోగదారులకు డీజిల్‌ ధర లీటరు రూ.134.50కి పెరిగింది. అదే ఢిల్లీలో రిటైల్‌ పెట్రోల్‌ బంకుల్లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.87.60 పైసలుగా ఉంది. విశాఖపట్నంలో బల్క్‌ ధర రూ.148.50 పైసలు కాగా, రిటైల్‌ ధర రూ.96.22 పైసలు ఉంది. హైదరాబాద్‌లో బల్క్‌ డీజిల్‌ లీటర్‌ ధర రూ.149.50 పైసలుగాఉంది. రిటైల్‌ బంకుల్లో లీటరు ధర 95.70 పైసలుగా ఉంది. అంటే లీటరుకు రూ.47 నుంచి రూ.52 వరకు తేడా ఉండటంతో బల్క్‌ వినియోగదారుల చూపు రిటైల్‌ ఔట్‌లెట్లపై పడింది. వారు చౌకైన రిటైల్‌ పెట్రోల్‌ పంపుల నుంచి డీజిల్‌ కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ ప్రభావం చమురు కంపెనీల బల్క్‌ అమ్మకాలపై స్పష్టంగా పడింది. తాజా గణాంకాల ప్రకారం బల్క్‌ సెగ్మెంట్‌లో డీజిల్‌ అమ్మకాలు 30 నుంచి 50 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రిటైల్‌ పెట్రోల్‌ బంకుల్లో ‘డీజిల్‌ నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ‘మోడీ మార్క్‌ ట్రేడింగ్‌’లో నేరుగా సామాన్య ప్రజానీకంపై ఆర్థికభారాలు వేయకుండా, పరోక్ష పన్నుల రూపంలో వారి జేబుల్ని గుల్ల చేయడమే లక్ష్యంగా విధాన నిర్ణయాలు జరుగుతున్నాయనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదేమో!

ఆర్టీసీపై పిడుగే!
ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న టీజీఎస్‌ ఆర్టీసీపై బల్క్‌ డీజిల్‌ ధరల పెంపుతో మరింత భారం పడింది. ఆ సంస్థ రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. లీటర్‌కు దాదాపు రూ.50 పెంపు వల్ల ఆర్టీసీపై రోజుకు రూ.3 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. ధరల పెంపు నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలని యాజమాన్యం కేంద్రానికి లేఖ రాసింది. కానీ అటునుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యుత్తరం రాకపోవడం గమనార్హం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -