Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకృష్ణా నదిలో మునిగి తాండూరు విద్యార్థి మృతి

కృష్ణా నదిలో మునిగి తాండూరు విద్యార్థి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పండుగ పూట ఆ కుటుంబంలో కృష్ణా నది తీరని విషాదాన్ని నింపింది. సరదాగా గడుపుదామని వెళ్లిన విహారయాత్ర ప్రమాదంగా మారి ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. కృష్ణా నదిలో మునిగి కుమారుడు మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన మక్తల్ సమీపంలోని జూరాల ప్రాజెక్టు వద్ద చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మహేష్ కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య బెన్నూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో వీరు నారాయణపేట జిల్లా మక్తల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం అందరూ కలిసి జూరాల ప్రాజెక్టును చూసేందుకు బయలుదేరారు. అక్కడ ప్రమాదవశాత్తు మహేష్, ఆయన కుమారుడు గౌరీ ప్రీతమ్ నదిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే తాండూరు చైతన్య పాఠశాలలో విద్యార్థిగా చదువుతున్న గౌరీ ప్రీతమ్ మృతి చెందాడు. తండ్రి మహేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కళ్లముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం, భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ తల్లి పెడుతున్న రోదనలు అక్కడున్న వారిని కలచివేసాయి. పండుగ వేళ బంధువుల ఇంట్లో సందడి నెలకొనాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తాండూరులోనూ, బంధువుల ఊరిలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -