Saturday, January 17, 2026
E-PAPER
Homeక్రైమ్ హరియాణాలో మహిళపై సామూహిక లైంగిక‌దాడి..

 హరియాణాలో మహిళపై సామూహిక లైంగిక‌దాడి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ :హరియాణాలో జరిగిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన 42 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక‌దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు, కేవలం 8 గంటల్లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాధిత మహిళ తన బంధువులతో కలిసి ఉద్యోగం వెతుక్కుంటూ ఈ నెల 12న తెల్లవారుజామున బహదూర్‌గఢ్‌కు చేరుకున్నారు. ఢిల్లీ-రోహ్‌తక్ రోడ్డులోని పండిట్ శ్రీరామ్ శర్మ మెట్రో స్టేషన్ సమీపంలో బస్సు దిగిన వారిని ఐదుగురు నిందితులు వెంబడించారు. తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు ఆమె బంధువులను బెదిరించి మహిళను బలవంతంగా పక్కనే ఉన్న ఓ నిర్మానుష్యమైన దాబాలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని దాబాలో ఉన్న సీసీటీవీ డీవీఆర్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, ఈ దారుణం మొత్తం అందులో రికార్డయినట్లు గుర్తించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరచగా, వారికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.

మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టబోమని ఝజ్జర్ పోలీస్ కమిషనర్ రాజ్‌శ్రీ సింగ్ స్పష్టం చేశారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -