నవతెలంగాణ-హైదరాబాద్ : జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.
కాగా, 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన మద్యం విధానంలో భారీగా అక్రమాలపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతోంది ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా, విజయసాయిరెడ్డికి నోటీసులు అందడం అత్యంత ప్రధాన్యతను సంతరించుకుంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి, ఆ నగదును మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్లుగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు హవాలా రూపంలో నగదు బదిలీ జరిగిందనే కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు చేపడుతుండా ఆయన పేరు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేసింది. గతంలోనూ కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొనగా.. తాజాగా ఆయనకు లిక్కర్ స్కామ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది.



