Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లొద్దికుంట–గంగదేవికుంట ఆయకట్టు.. శంకుస్థాపన చేసిన మునుగోడు ఎమ్మెల్యే

లొద్దికుంట–గంగదేవికుంట ఆయకట్టు.. శంకుస్థాపన చేసిన మునుగోడు ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్:  చౌటుప్పల్ మండలంలో సంవత్సరాలుగా ఎదురవుతున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. శనివారం చిన్న కొండూరు గ్రామ పరిధిలోని ఫిలాయపల్లి కాల్వ నుండి చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం పరిధిలో ఉన్న లొద్దికుంట, గంగదేవికుంటలకు నీటిని తరలించేందుకు రూ.1 కోటి 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా లొద్దికుంట,గంగదేవికుంటల కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు స్థిరీకరణ జరగనుంది. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు ఇది ఎంతో ఊరటనిచ్చే పథకంగా నిలవనుంది. కాల్వల ద్వారా నీటి సరఫరా సాధ్యమవడంతో, వ్యవసాయ భూములు ఎండబారకుండా కాపాడటంతో పాటు పంటల దిగుబడులు పెరగనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.సాగునీరు అందుబాటులో ఉంటేనే వ్యవసాయం నిలబడుతుందని, అందుకే చిన్న చిన్న చెరువులు, కుంటలు, కాల్వలను అనుసంధానం చేస్తూ ఆయకట్టు స్థిరీకరణ పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే లొద్దికుంట, గంగదేవికుంటల కింద ఉన్న విస్తారమైన ఆయకట్టు ప్రాంతం సాగులోకి వచ్చి, రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి మౌలిక వసతులు మెరుగుపడితే వలసలు తగ్గుతాయని,యువతకు వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ,పనులు నాణ్యతతో పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివిస్ జిఎం పెండ్యాల సుధాకర్ రావు మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్ చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి చిన్న కొండూరు సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని, సాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -