Tuesday, May 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమార్క్సిజం - మారుతున్న ప్రపంచం

మార్క్సిజం – మారుతున్న ప్రపంచం

- Advertisement -

ఈ రోజు కార్ల్ మార్క్స్ జయంతి. ఆయన 1818 మే5 న జర్మనీలోని ట్రయర్ పట్టణంలో జన్మించాడు. 65 సంవత్సరాలు జీవించి, 14 మార్చి 1883లో లండన్ నగరంలో మరణించారు. ఆయన తన మొత్తం జీవితాన్ని మానవజాతి పరిణామం గురించిన అధ్యయనానికే వెచ్చించారు. ఈ పరిణామక్రమంలో మానవ మనుగడకు కీలకమైన ఉత్పత్తి గురించి గొప్పగా విశ్లేషించారు. ఉత్పత్తి నిరంతరాయంగా అభివృద్ధి చెందుతుందనీ, కాని దానిపై యాజమాన్యం ఒక దశవరకూ స్థిరంగా ఉంటుందనీ, ఎపుడైతే ఉత్పత్తి అభివృద్ధికి ఆ దశలోని యాజమాన్య పద్ధతి ఆటంకమౌతుందో అపుడు ఉత్పత్తికారకులైన శ్రామికులు వారి నైపుణ్యాలకు, ఆనాటి యాజమాన్యపద్ధతికి ఘర్షణ తలెత్తుతుందనీ, దాని ఫలితంగా ఉత్పత్తి ఇంకా ఎదగటానికి సహకరించే కొత్త యాజమాన్య పద్ధతి(విప్లవంద్వారా) అమలులోకి వస్తుందనీ ఆయన నిరూపించాడు. ఈ సూత్రం మానవసమాజం స్థూలంగా ఆదిమ, బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారీ యాజమాన్య పద్ధతుల్లోకి ఎలా మారిందనే వాస్తవిక చరిత్రను వివరించాడు. ఇపుడున్న పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి పెరుగుదలకు ఉత్పత్తి సాధనాల (భూమి, యంత్రాలు వగైరా వనరులు)పై ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యం ఆటంకమైనపుడు సామాజిక విప్లవం ద్వారా సోషలిస్టు వ్యవస్థ(దోపిడీలేని వ్యవస్థ)కు పరిణామం చెందటం అనివార్యమని నిరూపించాడు.
ఈ శాస్త్రీయ ప్రతిపాదనలన్నీ మార్క్స్ ఊహించి చేసినవేమీ కావు. భూమి పుట్టుక నుండి ప్రకృతి, అందులో భాగమైన మానవ సమాజమూ నిరంతరాయంగా మారుతూ వస్తోంది. మార్క్స్ గొప్పదనమంతా వివిధ దశల్లో ఈ మార్పులకు కారణాలను విశ్లేషించటంలో, వాటినుండి సాదారణీకరిర్భా (సిద్ధాంతాలు)లో ఉంది. ఆ విధంగా ఆయన గతాన్ని విశ్లేషించి, వర్తమానాన్ని అర్థంచేసుకుని, భవిష్యత్తును అంచనా వేయగలిగాడు. ప్రకృతి, మానవసమాజమూ నిరంతరం అభివృద్ధి వైపు మార్పుచెందుతున్నట్లే అందులో భాగమైన మార్కిజం కూడా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. నూతన అంశాలను ఇముడ్చుకోవటం ద్వారా మార్క్సిజం అభివృద్ధి చెందటం మార్క్స్ కాలంలోనూ జరిగింది. లెనిన్ కాలంలో అది మరింతగా ముందుకు సాగింది. నేడు కూడా అదే జరగాల్సి ఉంది. నేడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, ఆటంకాలను ఈ దృష్టితో మనం పరిశీలించాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఆటంకాలు ఇపుడే కొత్తగా ఏర్పడినవి కావు. ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రంతా పరిశీలిస్తే అనేక సందర్భాలలో ఉద్యమం దారుణంగా దెబ్బతినటం, తిరిగి పుంజుకోవటం, రెట్టింపు బలంతో ముందుకు సాగటం మనం గమనించగలం. స్థూలంగా ఆ ఎత్తు పల్లాలను పరిశీలిద్దాం.

1848కి ముందు సిద్ధాంతం లేని దశ
మార్క్స్, ఎంగెల్స్‌ల కంటే ముందుకూడా కార్మికోద్యమం ఉంది. అనేక పోరాటాలు జరిగాయి. ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత కార్మికవర్గం పెరిగింది. యంత్రాలు రావటం వల్ల తాము పని కోల్పోతున్నామని యంత్రాలను ధ్వంసం చేసే లుడైట్ల ఉద్యమం మొదలుకొని సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్, ఫోరియర్ వగైరా ఊహాజనిత సోసలిస్టుల ప్రయోగాల వరకూ శ్రామికుల స్థితి మెరుగుదలకు అనేక విధాల కృషి జరిగింది. అయినా శాస్రీయమైన సిద్ధాంతం లేకపోవటం వల్ల కార్మికోద్యమం అనేక వైఫల్యాలకు గురైంది. విస్తరణకు కూడా ఆటంకాలేర్పడ్డాయి. ఈ ఆటంకాల నుండే కార్మికవర్గ విముక్తికి విప్లవ సిద్ధాంతం అవసరం ఏర్పడింది. ఈ అవసరం నుండే 1948లో మార్క్, ఎంగెల్స్‌లు ఉమ్మడిగా రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ కార్మిక వర్గానికి సిద్ధాంత ఆయుధంగా అందించబడింది.

1848-64 ప్రపంచ సమన్వయం లేని దశ
శాస్త్రీయ సిద్ధాంతం ఆవిర్భవించాక అనేక ప్రాంతాలకు, దేశాలకు కార్మికోద్యమం వ్యాప్తి చెందింది. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం ఇంకా అనేక యూరోప్ దేశాలకు ఉద్యమం విస్తరించింది. వయోజన ఓటింగ్, 8గం॥ పనిదినం డిమాండ్లతో ఇంగ్లండ్‌లో చార్టిస్టు ఉద్యమం జరిగింది. వయోజన ఓటింగ్ వస్తే కార్మిక, కర్షక రాజ్యాలు ఏర్పడతాయనే భ్రమలు కూడా అనాడుండేవి. ఉద్యమ వ్యాప్తి జరిగినా అన్ని దేశాల సమన్వయం లేకపోవటం ఉద్యమం మరింత వ్యాప్తి చెందటానికి ఆటంకమైంది. ఈ అవసరంలో నుండి 1864లో ఇంటర్నేషనల్ వర్కింగ్‌మెన్స్ అసోసియేషన్ అనే సంస్థ ఏర్పడింది.

1864-76 ఫస్ట్ ఇంటర్నేషనల్ అనుభవాలు,
పార్టీ అవసరమైన దశ

అంతర్జాతీయ సంస్థ ఏర్పడటం వల్ల మరిన్ని దేశాలకు ఉద్యమం విస్తరించింది. ఉద్యమం ఎంత బలంగా తయారైందంటే ఫ్రాన్స్ దేశంలోని ‘పారిస్‌’ నగరంలో విప్లవం ద్వారా మొదటి ‘కార్మిక రాజ్యం’ ఏర్పడింది. అయితే ఈ ప్రభుత్వం ‌డెబ్బయి రోజులు మాత్రమే నిలవగలిగింది. పెట్టుబడిదారీ వర్గం ఈ ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసింది. పారిస్‌లో 30వేల మందిని ఉరితీసారు. ఇంకా అనేక దేశాలలో వేలాది కార్మిక నాయకులను నిర్దాక్షిణ్యంగా చంపివేసారు. ఈ పరిస్థితుల్లో పనిజేయటం సాధ్యంకాక మొదటి ఇంటర్నేషనల్ సంస్థ కూడా రద్దు అయింది. ఇక కార్మికోద్యమం తలెత్తడం అసాధ్యమని పెట్టుబడిదారీ ప్రపంచం భావించింది. కానీ మార్క్స్ ఈ వైఫల్యం నుండి విలువైన గుణపాఠాలు తీసారు. పారిస్ విప్లవంలో రాజ్యాంగ యంత్రాన్ని నాశనం చేయకపోవటం, బ్యాంకులు జాతీయం చేయకపోవటం, ఉద్యమం కార్మికవర్గానికే పరిమితం కావటం వల్ల ఏర్పడిన రైతాంగ వ్యతిరేకత వీటన్నిటికంటే ముఖ్యంగా కార్మికులకు ఒక ‘రాజకీయ పార్టీ’ లేకపోవటం ముఖ్యమైన బలహీనతగా గుర్తించారు. ఈ ఆటంకాలనుండి బయటపడటానికి చాలా కాలం పట్టినా క్రమంగా ఉద్యమం బలపడి 1889 నాటికి అనేక దేశాలలో ‘సోషల్ డెమొక్రటిక్ పార్టీ’ పేరుతో కార్మికుల రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. అయితే వీటన్నింటి సమన్వయం కోసం మరో ఇంటర్ నేషనల్ సంస్థ అవసరమైంది. ఆ ఆటంకాన్ని అధిగమిస్తూ ఫ్రెడరిక్ ఎంగెల్స్ నాయకత్వంలో(అప్పటికి మార్క్స్ చనిపోయారు) రెండవ ఇంటర్నేషనల్ ఏర్పడింది.
1889-1905 రెండవ ఇంటర్నేషనల్ అనుభవాలు, సుశిక్షిత పార్టీ నిర్మాణ ఆవశ్యత : ఈ కాలంలో ముఖ్యంగా 1870 నుండి 1900 వరకూ కార్పొరేట్ల ధనికుల పెట్టుబడి బాగా పోగుబడింది. మార్కెట్ల కోసం వీరి గుత్తాధిపత్యంతో అనేక వలసలు ఏర్పడ్డాయి. మరోవైపు పారిశ్రామికాభివృద్ధి వల్ల కార్మికోద్యమాలు బలపడ్డాయి.1902లో రష్యన్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఏర్పడింది. ట్రాట్స్కీ, ప్లెఖనోవ్‌లు ప్రముఖ నాయకులు. వారి ప్రభావంతో లెనిన్, స్టాలిన్‌లు రంగంలోకి వచ్చారు. 1905లో రష్యా,జపాన్ యుద్ధం జరిగింది. పెద్దఎత్తున కార్మిక సమ్మెలు జరిగి రష్యాలో మొదటి విప్లవం సాగించబడింది. అయితే అది దారుణంగా అణచివేయబడి ఉద్యమం నష్టపోయింది. పార్టీ విచ్చిన్నంవైపు సాగింది. ఈ వైఫల్యాలకు కార్మిక,కర్షక ఐక్యత లేకపోవటం, నరోడ్నిక్కుల ఒంటెత్తు పోకడలతోబాటు పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి ఉద్యమం ముందుకు సాగటానికి ప్రధాన ఆటంకమై బలహీనపడింది. ‘కార్మికులకు రాజకీయ పార్టీ ఉంటేనే సరిపోదు. అది ఉక్కుశిక్షణగల విప్లవ పార్టీ’గా ఉండాలనే పాఠం తీయబడింది. ఆ కృషి లెనిన్ సాగించాడు. పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం, హోల్‌టైమర్ వ్యవస్థ, పార్టీ సభ్యులంటే ఎలా ఉండాలి? అనే అంశాలతోబాటు ఇంకా నిర్మాణ నిబంధనలు, సూత్రాలు ఈ అనుభవాల నుండి ఏర్పర్చుకోవటం జరిగింది.

1905-17 మొదటి ప్రపంచయుద్ద అనుభవాలు, సోషలిస్టు రాజ్య స్థాపన
1905 తర్వాత అనేక దేశాలో బలమైన విప్లవ పార్టీలు ఏర్పడ్డాయి. రష్యాతోబాటు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఇంకా అనేక దేశాలో బలంగా ఉద్యమం విస్తరిస్తున్న దశలో 1912లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలనే సమస్యపై కమ్యూనిస్టు ఉద్యమంలో తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. యుద్దంలో ప్రతి దేశ కమ్యూనిస్టుపార్టీ దేశభక్తిని ప్రదర్శించి ఆదేశ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని దాదాపు అన్నిదేశాల కమ్యూనిస్టులు వాదించారు. ఈ వాదనకు కాట్క్సీ ప్రధాన నాయకుడు. ఇది సామ్రాజ్యవాదుల యుద్ధమనీ, దీనిలో పాల్గొనటం కాకుండా, ప్రతి దేశ కమ్యూనిస్టు పార్టీ ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్దం ప్రారంభించాలని కార్మిక ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నించాలని లెనిన్ వాదించాడు. లెనిన్ ఒంటరివాడయ్యాడు. ఈ సిద్ధాంత విభేదంతో రెండవ ఇంటర్నేషనల్ సంస్థ రద్దు అయింది. లెనిన్ తన వాదనకనుగుణంగా రష్యాలో అంతర్యుద్దం సాగించి 1917లో సోషలిస్టు విప్లవం ద్వారా మొదటి కార్మిక, కర్షక రాజ్యం స్థాపించాడు. అలాకాక ఆయా దేశాల ప్రభుత్వాలను బలపర్చిన ఇతర దేశాల పార్టీలన్నీ బలహీనపడటమూ, కొన్ని పార్టీలు అంతరించటమూ జరిగింది. అయితే సోవియట్ సోషలిస్టు విప్లవం సూర్తితో అనేక 3వ ప్రపంచ దేశాలకు కమ్యూనిస్టు ఉద్యమం వ్యాప్తి చెందింది.

1918-49 కమ్యూనిస్టు (3వ)ఇంటర్‌నేషనల్ అనుభవాలు, సోషలిస్టు శిబిరం
సోవియట్‌పైనా, సోషలిజంపైనా పెట్టుబడిదారీ ప్రపంచం సాగించే సైద్ధాంతిక దాడిని ఎదుర్కొనేందుకు తిరిగి ప్రపంచ సంస్థ అవసరం ముందుకొచ్చింది. 1918లో కమ్యూనిస్టు ఇంటర్‌నేషనల్ ఏర్పడింది. సోషలిస్టు దేశాలలో ఆర్ధిక వ్యవస్థను సోషలిస్టు పద్దతిలో నిర్మించటానికి పూనుకున్నారు. కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమాలు ఎదుర్కొన్న అనేక ఆటంకాలు, సైద్ధాంతిక సమస్యలన్నింటినీ అనుభవాల ఆధారంగా మార్క్సిజాన్ని అన్వయించి, అభివద్ది పర్చటం ద్వారా సోషలిస్టు రాజ్యాలు, పెట్టుబడిదారీ వ్యవస్థకు దీటుగా సోషలిస్టు శిబిరం ఏర్పడ్డాయి. అయితే కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చాక సోషలిజం ఏ పద్ధతిలో నిర్మించాలి? అనే సమస్య ముందుకు వచ్చింది.

నేటి దశ-సోషలిస్టు దేశాల వైఫల్యాలు, సోషలిజం నిర్మించటం ఎలా?
మార్క్స్, ఎంగెల్స్‌లు పెట్టుబడిదారీ దశనుండి, సోషలిస్టుదశకు సమాజం పరిణామం చెందటం అనివార్యమైనా, పూర్తి స్థాయి సోషలిస్టు ఆర్ధిక వ్యవస్థను నిర్మించటానికి దశలవారీగా సుదీర్ఘకాలం ప్రయాణించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అంటే సొంత ఆస్తే లేని సోషలిస్టు దశకు చేరుకోవాటానికి ముందు ఒకేసారి కాకుండా ప్రజల చైతన్యస్థాయి, ఆనాటి ఉత్పత్తి శక్తుల అభివద్ది స్థాయి, ప్రపంచ పెట్టుబడిదారీ ప్రపంచ శక్తి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని స్వంత ఆస్తి సమస్యపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా ఉత్పత్తిలో వివిధ దశల్లో పెట్టుబడిదారీ పద్ధతులు కూడా కొన్ని మిళితం చేయాల్పి ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యం, ప్రభుత్వ-ప్రయివేటు జాయింట్ యాజమాన్యం, సహకార సంస్థల రూపంలో యాజమాన్యం, పూర్తిగా ప్రయివేటు యాజమాన్యం లాంటి అనేక రూపాలలో యాజమాన్య హక్కులుంటాయి. అలాగే ఉపరితలంలో రాజకీయాలు, రాజ్యాంగ యంత్రం, సాంస్కృతిక సమస్యలు ఇతర అనేక అంశాలలో మార్పులు జరగాల్సి ఉంటుంది. ఇవి ఒక్కోదేశానికి ఒక్కోరకంగా ఉంటాయి. అందువల్ల మార్క్స్, ఎంగెల్స్ కాలంలో నిర్ధిష్ట నమూనాలను రూపొందించే అవకాశం లేదు. రష్యాలోని నిర్ధిష్టపరిస్థితిని బట్టి లెనిన్, స్టాలిన్‌ల కాలంలో కొన్ని అనుభవాలు, వాటి నుండి పాఠాలు తీయటం, పాలనలో మార్పులు తేవటం జరిగింది. కానీ తర్వాతి కాలంలో అనుభవాలను క్రోడీకరించి అవసరమైన మార్పులుచేసి, మార్క్సిజంను అభివృద్ధి పర్చటంలో సోవియట్ కమ్యూనిస్టులు, తూర్పు యూరప్ సోషలిస్టు దేశాల కమ్యూనిస్టు పార్టీలు వైఫల్యం చెందాయి. అందుకే ఆ ప్రభుత్వాలు కూలిపోయి తిరిగి పెట్టుబడిదారీ దేశాలుగా మారిపోయాయి. ఈ అనుభవాలతో మిగిలిన చైనా, వియత్నాం తదితర సోషలిస్టు దేశాలు ఆర్ధిక వ్యవస్థ నిర్మాణంలో ఉత్పత్తి శక్తుల పెంపుదలకు (సంపదల పెంపుదల) కొన్ని ప్రయోగాలు జరపుతున్నాయి. ఆ ప్రయోగాలు జయప్రదమై నేటి కాలంలో మార్క్సిజం అమలుకు కొత్తదారులు ఏర్పడతాయా లేక వాటి అమలులో ఉన్న పెట్టుబడిదారీ అంశాలు ఆధిపత్యంలోకి వచ్చి విఫలమైతే మరిన్ని కొత్త ప్రయోగాలు, సిద్ధాంతీకరణలు జరగాల్సి ఉంటుందా? అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో సోషలిజం ఎలా ఉండాలి అనేది సీపీఐ(ఎం) కొజికోడ్ మహాసభ(2012)లో స్థూలంగా నిర్దారించుకున్నది. దానిలో ప్రజాస్వామ్యం, బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ తదితర అంశాల గురించి చెప్పటం జరిగింది.

అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత, భవిష్యత్తు ప్రపంచం
సోషలిస్టు శిబిరం విచ్చిన్నం ముఖ్యంగా సోవియట్‌లో సోషలిజం దెబ్బతినటం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు, వామపక్షవాదుల, అభ్యుదయ శక్తులను బాగా నిరాశకు గురిచేసింది. మరోవైపు అమెరికా ఆధిపత్యంలో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం ఏకధృవ ప్రపంచంగా మారి ప్రజానీకం మరింత దోపిడీ, పీడనలకు గురౌతున్నది. ఈ ఆటంకాల నుండి కమ్యూనిస్టు ఉద్యమం బయటపడాలి. గత అనుభవాలను బట్టి ఉద్యమాలు సరళరేఖలో సాగిపోవనీ, ఈ ఆటుపోట్లు సహజమనీ, ఇంతకంటే పెద్ద ఆటంకాలను, ఊచకోత హత్యాకాండలను కూడా అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమం పురోగమించిందనీ మనకు అర్ధమౌతుంది. అందువల్ల నేటి ఆటంకాలు, ఉద్యమ బలహీనతల నుండి గుణపాఠాలు నేర్చుకోవటం, తిరిగి ఉద్యమం ఉవ్వెత్తున మళ్లీ పుంజుకోవటం అనేది అనివార్యమైన పరిణామం.
నేడు అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం కేవలం ఆ మూడుదేశాలకేగాక మొత్తం ప్రపంచంపైన ప్రభావం చూపుతుంది. ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడతాయి. అమెరికా తిరుగులేని ప్రపంచాధిపత్యం బద్దలౌతుంది. అమెరికా ఆర్ధిక, మిలటరీ శక్తులు ఇప్పటికే బాగా బలహీనపడ్డాయి. ఇక మిగిలిందల్లా డాలర్ అధిపత్యమే. డాలర్ తిరులేని ప్రపంచ కరెన్సీగా చలామణీ అయ్యే దశ అంతమౌతున్నది. చైనా అధ్వర్యంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక దక్షిణాది దేశాలు ఈ సమస్యపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. ఈ క్రమం ఇంకా వేగవంతమై అమెరికా పెత్తనం నశించి బహుళధృవ ప్రపంచం ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధికున్న ఈ ముఖ్యమైన ఆటంకం తొలగితే, మిగతా ఆటంకాలు బలహీనమవటం, ఉద్యమాలు తిరిగి ఉత్సాహంగా సాగటం తప్పక జరుగుతుంది.
(నేడు కార్ల్ మార్క్స్ 209వ జయంతి)
తమ్మినేని వీరభ్రదం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -