నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ఉన్నావ్ లైంగిక దాడి ప్రధాన నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఉన్నావ్ బాధితురాలి తండ్రి ‘కస్టడీ’ మృతి కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్ రవీందర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. గతంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ నుంచి విడుదల చేయొద్దని పోలీసుశాఖను ఆదేశించింది.
2017లో కుల్దీప్ సింగ్ సెంగర్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 ఏప్రిల్‌లో ఆమె తండ్రి పోలీసు కస్టడీలో మృతి చెందాడు. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి దిల్లీకి బదిలీ చేశారు. అత్యాచారం కేసులో జీవిత ఖైదు, బాధితురాలి తండ్రి మృతి కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది.



