నవతెలంగాణ-హైదరాబాద్: నిరాశ్రయులైన కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్లకు తిరిగి రావడానికి తాము ఎల్లప్పుడూ వారికి స్వాగతం పలుకుతామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సోమవారం అన్నారు. కాశ్మీర్ లోయలో ఉన్న కాశ్మీరీ పండిట్లు దేశంలో వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఇప్పుడు వారి పిల్లలు పిల్లలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఉద్యోగం, విద్య వంటి కారణాల వల్ల వారు అక్కడే నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎప్పుడైనా కాశ్మీర్‌ని సందర్శించడానికి వస్తారు కానీ, శాశ్వతంగా ఉండిపోవడానికి వస్తారా? అని ఫరూక్ సందేహం వ్యక్తం చేశారు.
జనవరి 19వ తేదీన ‘హోలోకాస్ట్ డే’. పాకిస్తాన్ ఉగ్రవాదుల బెదిరింపులు, హత్యల కారణంగా 1990లో కాశ్మీర్ లోయ నుండి వందలాది మంది పండిట్లు వలసలు వెళ్లారు. ఆరోజును ‘హోలోకాస్ట్ డే’గా ప్రజలు గుర్తు చేసుకుంటారు. ఈ హోలోకాస్ట్ డే సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కాశ్మీరీ పండిట్లు తిరిగి కాశ్మీర్‌కు, వారి నివాసాలకు రావడానికి స్వాగతిస్తామని సోమవారం ప్రకటన చేశారు.
కాగా, కాశ్మీర్ లోయలో రెండురోజులపాటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా కాశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించాలని డిమాండ్ గురించి ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘వారు (కాశ్మీర్ పండిట్లు) కాశ్మీర్‌కి ఎప్పుడు తిరిగి వస్తారు? వస్తే వాళ్లని ఎవరు ఆపుతున్నారు? వాళ్లను ఎవరూ ఆపడం లేదు. వారు తిరిగి రావాలి. ఎందుకంటే ఇది వారి ఇల్లు. చాలామంది కాశ్మీరీ పండిట్లు ప్రస్తుతం లోయలో నివశిస్తున్నారు. వారు వాళ్ల గ్రామాలను వదిలి వెళ్లలేదు. వారి నివాసాల్లో ప్రశాంతంగా జీవిస్తున్నారు’ అని ఆయన అన్నారు.
ఆదివారం సాయంత్రం వందలాది మంది కాశ్మీరీ పండిట్లు.. కాశ్మీర్‌లోయకు తిరిగి వస్తే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘యూత్ 4 పానున్ కాశ్మీర్’ అనే బ్యానర్‌ని పట్టుకుని జగ్తి క్యాంప్ సమీపంలో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని నిర్బంధించారు. పండిట్లు తిరిగి వస్తే లోయలో తమ నివాసానికి ప్రత్యేక భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, వీరి డిమాండ్లపై ఫరూక్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పండిట్ల కోసం కొత్త ఇళ్లను నిర్మించి ఇస్తుందని, అవసరమైన సహాయాన్ని అందిస్తుందని ఫరూక్ హామీనిచ్చారు.



