– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం శివారులో కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ సిటీ వెంచర్ సమీపంలో అరైవ్.. అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మర్‌పల్లి ఎస్‌ఐ జి.అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్ డ్రైవర్‌లు సీట్‌బెల్ట్ వినియోగించాలని తెలిపారు.
అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. రోడ్డు నియమాలను పాటించడం ద్వారా తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగలమని తెలిపారు.ప్రజలు అందరూ సేఫ్ డ్రైవింగ్-సేఫ్ లైఫ్ నినాదాన్ని పాటించాలని, ప్రాణాలతో గమ్యస్థానానికి చేరుకోవడమే అరైవ్ అలైవ్ లక్ష్యమని ఎస్‌ఐ అనిల్ రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



