నవతెలంగాణ-హైదరాబాద్ : తమ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. తమ దేశంలో మైనారిటీలకు సంబంధించిన ఘటనల్లో చాలా వరకు నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తులు చేసినవేనని, వాటిలో మతపరమైన ఉద్దేశాలు లేవని తెలిపింది. మైనారిటీలకు సంబంధించి గత ఏడాది 645 ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కార్యాలయం వివరాలు వెల్లడించింది.
వాటిలో 71 ఘటనల్లో మతపరమైన కోణాలు ఉన్నట్లు పేర్కొంది. ఆలయాలపై దాడులకు సంబంధించి 38 ఘటనలు నమోదైనట్లు తెలిపింది. ఆ 71 ఘటనలకు సంబంధించి 50 అంశాల్లో పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. మిగిలిన 21 ఘటనలపై తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. నేరం ఏదైనా తీవ్రంగానే పరిగణిస్తున్నామని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
మరోవైపు, ఈ ప్రకటనను బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్థులను ప్రోత్సహించి, వారికి శిక్షపడదనే భావనను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత మూడు వారాల వ్యవధిలోనే 10 మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్‌లో హత్యకు గురయ్యారు. దీంతో అక్కడి హిందువులు, ఇతర మైనారిటీల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ దాడులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.



