నవతెలంగాణ-హైదరాబాద్: అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కర్ణాటక డిజిపి కె.రామచంద్రరావుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డీజీపీ అసభ్యకరంగా ప్రవర్తించారని, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించారని సోమవారం ఆలస్యంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉత్తర్వుల ప్రకారం..”1968నాటి అఖిలభారత సర్వీస్ (ప్రవర్తన) నియమాల్లోని 3వ నిబంధనను ప్రాథమికంగా ఉల్లంఘించారు. 1969నాటి అఖిలభారత సర్వీస్ (క్రమశిక్షణ మరియు అప్పీల్) నియమాల్లోని 3(1)(ఎ) నిబంధన ప్రకారం సస్పెన్షన్ అమలు చేయబడింది. విచారణ పెండింగ్‌లో ఉంది” అని పేర్కొంది.
ముందస్తు అనుమతి లేకుండా ఆయన హెడ్‌క్వార్టర్స్ నుండి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. నిబంధనల ప్రకారం.. జీవనాధార భృతి పొందుతారని తెలిపింది. తన సవతి కుమార్తెకి సంబంధించిన బంగారం స్మగ్లింగ్ కేసుని విచారిస్తున్న డీజీపీ తన కార్యాలయంలో ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళతో చాట్ చేస్తున్న రెండు ఆడియో రికార్డులు విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ అంశం తీవ్రత దృష్ట్యా సస్పెన్షన్ తక్షణ చర్యగా భావిస్తున్నామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. ఆయనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.



