నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ కేసరి గ్రూప్ వార్తాపత్రిక ప్రింటింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్ణయం కారణంగా.. కొన్ని సంచికల ప్రచురణ ప్రభావితమవుతుందన్న పంజాబ్ కేసరి గ్రూప్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
”మా వార్తాపత్రిక ఒక కథనం కారణంగా నిలిచిపోకూడదు. మా ప్రెస్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది” అని వార్తాపత్రిక తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి కేసును అత్యవసర విచారణ కోసం ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ”ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పంజాబ్ కేసరిలో ప్రచురితమైన కథనం కారణంగా, ప్రింటింగ్ ప్రెస్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. యజమానుల హోటళ్లు మూసివేయబడ్డాయి. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి” అని ముకుల్ రోహిత్గి కోర్టుకు తెలిపారు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు పిటిషన్‌ను విచారించి తీర్పును రిజర్వ్ చేసిందని అన్నారు. అయితే మధ్యంతర ఉపశమనం మంజూరు కాలేదని ఆయన చెప్పారు. పంజాబ్ కేసరి గ్రూప్ కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిందని ఆప్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
”ఇరుపక్షాల హక్కులకు భంగం వాటిల్లకుండా, కేసు యోగ్యతపై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా, పంజాబ్ కేసరి ప్రింటింగ్ ప్రెస్‌లు నిరంతరాయంగా కొనసాగాలని మరియు ఇతర ఆస్తులకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి” అని ధర్మాసనం ఆదేశించింది. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆగ్రూప్ పిటిషన్‌పై తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రింటింగ్ ప్రెస్‌లను అనుమతించే తమ ఉత్తర్వులు వారం పాటు కొనసాగుతాయని ధర్మాసనం పేర్కొంది.



