-రోడ్లపై మట్టి.. వాహనదారులకు చుక్కలు
-భద్రతా చర్యలు శూన్యం.. ప్రమాదాలకు ఆహ్వానం
-స్పందించని అధికారులు..పెరుగుతున్న ఇబ్బందులు
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలో ఓ ప్రైవేట్ సంస్థ చేపడుతున్న అండర్‌గ్రౌండ్ ఫైబర్ కేబుల్ తవ్వకాలు అస్తవ్యస్తంగా మారాయి.ప్రధాన రహదారులు,వ్యాపార సముదాయాలు,నివాస గృహాల ఎదుట ఎక్కడపడితే అక్కడ గుంతలు తవ్వుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తవ్వకాల సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో పాటు హెచ్చరిక బోర్డులు,బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని అంటున్నారు.తవ్విన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి.ముఖ్యంగా తారు రహదారులపై మట్టిని అలాగే వదిలేయడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం నెలకొంది.
ఇటీవల కురిసిన చిరుజల్లుల కారణంగా మట్టి బురదగా మారి వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొన్నిచోట్ల స్థానికులే స్వయంగా రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.వ్యాపార సంస్థల ముందు తవ్వకాలు చేయడంతో వినియోగదారుల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గుంతల కారణంగా చిన్నపిల్లలు,వృద్ధులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు,ఆర్ అండ్ బి శాఖ స్పందించి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా పనులు చేపడుతున్న సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అలాగే తవ్విన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించి రహదారులను యథావిధిగా మార్చాలని కోరుతున్నారు.




