నవతెలంగాణ-హైదరాబాద్: గ్రేటర్ నోయిడా 150 ప్రాంతంలో మురుగు కాలువలో కారు పడి 27 ఏళ్ల యువరాజ్ మెహతా అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సదురు వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై జవాబుదారీతనం లేకపోవడంపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు.
‘రోడ్లు, వంతెనలు, మంటలు, నీరు మనుషుల్ని చంపుతాయి. అవినీతి, ఉదాసీనత సైతం చంపేస్తుంది. భారత దేశ పట్టణాల పతనానికి డబ్బు, సాంకేతికత లేదా పరిష్కారాలు లేకపోవడం కారణం కాదు.. కేవలం జవాబుదారీతనం లేకపోవడం వల్లే జరుగుతుంది. టిఐఎన్‌ఎ : దేర్ ఈజ్ నో అకౌంటబులిటీ’ రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సదర్ అశుతోష్ గుప్తా వెల్లడించారు. కుమారుడి మరణంపై యువరాజ్ తండ్రి రాజ్‌కుమార్ మెహతా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కొడుకు ప్రాణాల్ని రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. అక్కడున్న ప్రజల్ని కాపాడమని కేకలు వేశాడు. కానీ అక్కడున్న జనం చూస్తూ ఉండిపోయారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా వీడియోలు తీసుకున్నారు. నా కొడుకు ప్రాణాల్ని కాపాడుకోవడానికి రెండు గంటలు కష్టపడ్డాడు. ఆ సమయంలో అక్కడున్న అధికారులు, సిబ్బంది నా కొడుకును కాపాడలేదు. వారి దగ్గర ఎవరూ డ్రైవర్లు లేరు. ఈ సంఘటన జరగడానికి పరిపాలన నిర్లక్ష్యమే కారణం’ అని ఆయన అన్నారు.



