13 బంతుల్లోనే ఉర్విల్ పటేల్ అర్థ సెంచరీ
లక్నోపై చెన్నై అదిరే విజయం
లక్నో 203/8
చెన్నై 208/5
యువ బ్యాటర్ ఉర్విల్
పటేల్ (65) ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 2019 నుంచి ఐపీఎల్‌లో 180 ప్లస్ లక్ల్యాలను ఛేదించటంలో ఏకంగా 15 సార్లు విఫలమైన సూపర్‌కింగ్స్.. ఉర్విల్ పటేల్ సునామీ ఇన్నింగ్స్‌తో ఆ బలహీనత అధిగమించింది. 204 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ 19.2 ఓవర్లలోనే ఊదేసింది. సూపర్‌జెయింట్స్‌పై 5 వికెట్లతో గెలుపొంది ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. సీజన్లో ఎనిమిదో ఓటమితో లక్నో సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
నవతెలంగాణ-చెన్నై
చెన్నై సూపర్‌కింగ్స్ ఎట్టకేలకు 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించింది. యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (65, 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌కు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (42, 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు శాంసన్ (28, 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 19.2 ఓవర్లలోనే 208 పరుగులు సాధించిన సూపర్‌కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోశ్ ఇంగ్లిశ్ (85, 33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
ఉర్విల్ చెడుగుడు
చెన్నై సూపర్‌కింగ్స్ లక్ష్యం 204 పరుగులు. 2019 ఐపీఎల్ నుంచి సూపర్‌కింగ్స్ 180 పైచిలుకు టార్గెట్‌లను ఛేదించటంలో 15 మ్యాచ్‌ల్లో తేలిపోయింది. వరుస విజయాలతో జోరుమీదున్నా, సూపర్‌కింగ్స్ విజయంపై దీమా లేదు. ఓపెనర్లు సంజు శాంసన్ (28), రుతురాజ్ గైక్వాడ్(42) పవర్‌ప్లేలో ధనాధన్ ఆరంభం అందించారు. సంజు 2 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదగా.. గైక్వాడ్ 3 ఫోర్లు, 2 సిక్స్‌లు సంధించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 3.4 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. సంజు శాంసన్‌ను దిగ్వేశ్ క్లీన్‌బౌల్డ్ చేయటంతో లక్నోకు తొలి బ్రేక్ లభించింది. సంజు వికెట్ పడగొట్టిన ఆనందం లక్నో శిబిరంలో ఎంతో సేపు నిలువలేదు. క్రీజులోకి వస్తూనే.. అవేశ్ ఖాన్‌పై విరుచుకుపడ్డాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో హడలెత్తించాడు. దిగ్వేశ్‌పై మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మహ్మద్ షమి ఓవర్లో ఓ సిక్సర్, సింగిల్‌తో 13 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఏడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో లక్నో బౌలర్లను ఊచకోత కోసిన ఉర్విల్ సూపర్‌కింగ్స్ విజయానికి గట్టి పునాది వేశాడు. అర్థ సెంచరీ తర్వాత ఓ సిక్స్, ఫోర్ బాదిన ఉర్విల్ పటేల్.. షాబాజ్ అహ్మద్ ఓవర్లో డగౌట్‌కు చేరుకున్నాడు. 3.4 ఓవర్లలో 45/1తో క్రీజులోకి వచ్చిన ఉర్విల్.. 9.2 ఓవర్లలో 126/2తో వెనక్కి వెళ్లాడు. కార్తీక్ శర్మ (20), డెవాల్డ్ బ్రెవిస్ (10) రిస్క్ తీసుకోకుండా పరుగులు రాబట్టినా.. అవేశ్ ఖాన్, దిగ్వేశ్‌లు ఈ ఇద్దరిని అవుట్ చేసి సూపర్‌జెయింట్స్ శిబిరంలో ఆశలు రేపారు. ప్రశాంత్ వీర్ (17 నాటౌట్), శివం దూబె (15 నాటౌట్) హైడ్రామాకు తావులేకుండా లాంఛనం ముగించారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అవేశ్ ఖాన్ వికెట్ అవకాశాలను సృష్టించినా.. ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేశారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ (2/30), దిగ్వేశ్ (2/45) రాణించారు. 19.2 ఓవర్లలో 208 పరుగులు చేసిన సూపర్‌కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇంగ్లిశ్ ధనాధన్
చెపాక్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. లక్నో కీలక బ్యాటర్లు నిరాశపరిచినా.. ఓపెనర్ జోశ్ ఇంగ్లిశ్ (85) ఒంటిచేత్తో సూపర్‌జెయింట్స్‌ను ముందుకు నడిపించాడు. పవర్‌ప్లేలో దండయాత్ర చేసిన ఇంగ్లిశ్ చెన్నై బౌలర్లపై పంజా విసిరాడు. మిచెల్ మార్ష్ (10)తో కలిసి తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలోనే 77 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంగ్లిశ్ దూకుడుకు తొలి 6 ఓవర్లలో 91/1తో నిలిచిన సూపర్‌జెయింట్స్ భారీ స్కోరు దిశగా సాగింది. ఇంగ్లిశ్ 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో 17 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇంగ్లిశ్‌ను జెమీ ఓవర్టన్ నిలువరించాడు. 112 పరుగుల వద్ద ఇంగ్లిశ్ వికెట్ కోల్పోయిన సూపర్‌జెయింట్స్ అక్కడ్నుంచి పరుగుల వేటలో తడబడింది. నికోలస్ పూరన్ (1), రిషబ్ పంత్(15), ఎడన్ మార్‌క్రామ్ (6), అక్షత్ (18) నిరాశపరిచారు. ఆఖర్లో షాజాబ్ అహ్మద్ (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో లక్నోకు 200 ప్లస్ స్కోరు అందించాడు. హిమ్మత్ సింగ్ (17, 12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. 20 ఓవర్లలో 8 వికెట్లకు లక్నో 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్ (3/36), అన్షుల్ కాంబోజ్(2/47) వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
లక్నో సూపర్‌జెయింట్స్ : 203/8 (జోశ్ ఇంగ్లిశ్ 85, షాజాబ్ అహ్మద్ 43, జెమీ ఓవర్టన్ 3/36, అన్షుల్ కాంబోజ్ 2/47)
చెన్నై సూపర్‌కింగ్స్ : 208/5 (ఉర్విల్ పటేల్ 65, రుతురాజ్ గైక్వాడ్ 42, షాబాజ్ అహ్మద్ 2/30, దిగ్వేశ్ 2/45)



