Saturday, May 24, 2025
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

- Advertisement -

ఎన్‌కౌంటర్లపై సుప్రీం జడ్జితో విచారించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ

ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఆపరేషన్‌ కగార్‌ను ప్రభుత్వం వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న నరమేధంలో ఎంతోమంది మావోయిస్టులు చనిపోయారని, దీన్ని తమ పార్టీ ఖండిస్తున్నట్టు తెలిపారు. కగార్‌ ఆపరేషన్‌ను వెంటనే ఆపి అక్కడున్న మిలిటరీ, పోలీసు బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చర్చలకు వస్తామని మావోయిస్టులు సానుకూలంగా స్పందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా కక్షపూరితంగా ఎన్‌కౌంటర్‌ చేయడం సరికాదన్నారు. అడవిలో ఉన్నవారు ప్రజల కోసం పోరాడుతున్నారే తప్ప వ్యక్తిగత హింస చేయడం లేదన్నారు. వారిని దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా కాల్చి చంపడం దారుణమన్నారు. అడవిలో ఉన్న సహజ వనరులు, ఖనిజ సంపద నిక్షేపాలు కాజేసి బడా కంపెనీలకు అప్పజెప్పడం కోసం ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని విమర్శించారు. కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న 27 మందిని ఉగ్రవాదులు హత్య చేస్తే వారిని ఇప్పటివరకు కేంద్రం పట్టుకోలేదని, ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనపరచుకోలేదని, ఏం సాధించారని యుద్ధం ఆపేశారని ప్రశ్నించారు. దేశంలో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. ఆపరేషన్‌ కగార్‌పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ విషయాలను ప్రజలకు, అఖిలపక్షానికి వివరించాలని, పార్లమెంట్‌ లో చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమా వేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, పార్టీ పట్టణ-1,2 కార్యదర్శులు డా.మల్లు గౌతమ్‌ రెడ్డి, బావాండ్ల పాండు, జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్‌, వినోద్‌ నాయక్‌, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, నాయకులు కష్ణయ్యలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -