నవతెలంగాణ-హైదరాబాద్ : బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో సూట్ వేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇరిగేషన్ లీగల్ సమస్యలపై న్యాయ సలహాలు తీసుకుంటోంది. డ్రాఫ్ట్ రెడీ అయ్యాక ఏజీతో చర్చించనుంది. అనంతరం సుప్రీం కోర్టులో సూట్ దాఖలు చేయనుంది. అలాగే తెలంగాణలో చేపడుతున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్వోసీ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. త్వరలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాగా ఇప్పటికే పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపైనా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను వెనక్కి సైతం తీసుకుంది. సివిల్ సూట్ రూపంలో మళ్లీ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో బనకచర్లపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుపైనా సూట్ వేయాలని నిర్ణయించుకుంది.



