నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దీపక్ ఆత్మహత్యకు కారణమైందన్న ఆరోపణలపై షిమ్జితా ముస్తఫా(35)ను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ మరణానికి ఆమె చర్యలే కారణమని పేర్కొంటూ సోమవారం కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. దీపక్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిన కమిషన్, వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డీసీపీకి సూచించింది.
వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం దీపక్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అతను తనను ఉద్దేశ్యపూర్వకంగా తాకాడని ఆరోపిస్తూ షిమ్జితా ముస్తఫా వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. దాదాపు 20 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. దీపక్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వీడియో వైరల్ కావడం, సోషల్ మీడియాలో అవమానానికి గురవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన దీపక్, కోజికోడ్‌లోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దీపక్ ఆత్మహత్య అనంతరం షిమ్జితా ఆ వీడియోను తొలగించింది. తనను తాను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్టు చేసిన ఆమె, దానిని కూడా కొద్దిసేపటికి ప్రైవేట్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా ఆమెను అరెస్టు చేశారు.



