నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను గౌరవించకుండా, అసెంబ్లీ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ వాకౌట్ చేస్తున్నారు. ఇటీవల కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన మాదిరిగానే ఇవాళ కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సభను వాకౌట్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగాన్ని కాకుండా, సొంతంగా తయారు చేసిన ప్రసంగాన్ని చదవడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మొగ్గు చూపారు. ఆయన చర్యపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేయగా, సభను ఆయన వాకౌట్ చేశారు. గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
మంత్రి మండలి ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని కాదని, గవర్నర్ తాను సొంతంగా తయారు చేసుకున్న ప్రసంగాన్ని చదవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. గవర్నర్ చర్య భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163లను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, ఆయన తన రాజ్యాంగబద్ధమైన విధులను విస్మరించారని సిద్ధరామయ్య విమర్శించారు. ఈ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానాన్ని (సుప్రీంకోర్టు) ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.



