నవతెలంగాణ-హైదరాబాద్: సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ టిటిడి నుంచి నెయ్యి సరఫరాదారులతో పాటుగా అనేక మందిని ప్రశ్నించింది. మరి కొందరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. కాగా, సిట్ విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్దమైంది.
15 నెలలుగా.. 12 రాష్ట్రాల్లో విచారణ ….
గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో టిటిడి లడ్డూ కల్తీ నెయ్యి కేసు విచారణ సాగింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ముందుగా తమిళనాడులోనే కేసు మూలాలు ఉన్నాయని దర్యాప్తు బృందాలు భావించాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను విచారించారు. వారినే కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల ప్రమేయం పైన సిట్ లోతుగా విచారణ చేసింది. టిటిడి లో కీలక పదవుల్లో ఉన్నవారితో సహా పలువురిని సిట్ విచారణ చేసింది. స్వయంగా నెయ్యి వాడకాన్ని సమీక్షించింది. నెయ్యి కల్తీ విధానాన్ని గమనించింది. కావాల్సిన సమాచారం పైన ఆరా తీసింది.
సిట్ దాఖలు చేసే ఛార్జ్ షీట్ పై సర్వత్రా ఆసక్తి ….
టిటిడి మాజీ ఈవో శ్యామల రావుతోనూ సిట్ చర్చించింది. కావాల్సిన సమాచారాన్ని సేకరించింది. కాగా… కల్తీ నెయ్యికి రసాయనాల కొనుగోళ్లు, టిటిడి నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు ? కల్తీ నెయ్యి అని తెలిసినా.. తిరుమలకు ఎవరు అనుమతించారనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిగింది. తొలి ఛార్జ్షీటులో 24 మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బఅందాలు.. మరో 12 మంది కూడా ఉన్నట్టు కోర్టుకు తెలిపాయి. కాగా.. ఇప్పుడు సిట్ దాఖలు చేసే ఛార్జ్ షీట్ లో ఎవరి పేర్లు ప్రస్తావనకు రానున్నాయి… సిట్ విచారణలో భాగంగా ఏం తేల్చింది.. ఎవరి ప్రమేయం ఏంటి అనేది ఇందులో వివరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు సిట్ దాఖలు చేయబోయే ఛార్జ్ షీట్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.



