– రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఆళ్ల హనుమంతరావు మృతి
– జానకిపురం వద్ద ఘటన
నవతెలంగాణ – బోనకల్
బావమరిదిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరిన బావ మృత్యువాత పడిన ఘటన బోనకల్ మండలంలోని జానకిపురం బస్టాండ్ వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు ఆళ్ల హనుమంతురావు(73) శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో తన టీవీఎస్ వాహనంపై ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రానికి బయలుదేరాడు. అయితే జానకిపురం వద్ద తన బంధువులు కలవడంతో ఓ ఐదు నిమిషాలు పాటు మాట్లాడి బయలుదేరారు. ఇదే సమయంలో వైరా వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో టీవీఎస్ రోడ్డు కింద పడిపోవుగా హనుమంతరావు పడిపోయి తల రోడ్డు మార్జిన్ మీద పడింది. ఇదే సమయంలో లారీ వెనుక టైర్లు హనుమంతరావు తల మీద పోవటంతో అక్కడే మృతి చెందారు.
లారీ డ్రైవర్ ఆ వెంటనే వేగంగా వెళుతుండగా స్థానికులు వెంటపడి పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హనుమంతరావు మృతదేహాన్ని మధిర ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పెద్ద బీరవల్లి గ్రామానికి సీపీఐ(ఎం) నాయకులు, బంధువులు తరలించారు. హనుమంతరావు మృతితో కుటుంబంతోపాటు, ఆ గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన బావమరిదిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వెళుతూ హనుమంతరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ప్రతి ఒక్కరు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమారు నాలుగేళ్ల క్రితమే అనారోగ్యంతో భార్య మృతి చెందింది. హనుమంతురావు ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావటమే కాక ఇద్దరు అల్లుళ్ళు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కావటం మరో విశేషం. కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. కోడలు గృహిణి.
ఆళ్ల హనుమంతరావు పెద్ద బీరవల్లి సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. ఒక దపా ఉప సర్పంచ్ గా పనిచేశారు. పెద్ద బీరవల్లి సొసైటీ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. పెద్ద బీరవల్లిలో సీపీఐ(ఎం) అభివృద్ధిలో ఆళ్ల హనుమంతరావు పాత్ర చాలా కీలకం. పెద్ద బీరవల్లిలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో హనుమంతరావు చురుకైన పాత్ర నిర్వహించాడు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయడంలో హనుమంతరావు పాత్ర మరువలేనిది.
పెద్ద బీరవల్లిలో మృతదేహాన్ని చూడటానికి సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తమ నాయకుడి మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టటం విశేషం. మృతదేహాన్ని ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, ఉప సర్పంచ్ పెద్ద పోలు రామారావు, మాజీ సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ, మిర్యాల వెంకటకృష్ణ, మాజీ సొసైటీ అధ్యక్షులు ఆళ్ల ప్రసాద్, గ్రామ శాఖా కార్యదర్శులు చింతలచెరువు రమేష్, సీనియర్ నాయకులు పెద్దపోలు కోటేశ్వరరావు, చల్లగుండ్ల రామనర్సయ్య, తదితరులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హనుమంతరావు మృతదేహంపై సీపీఐ(ఎం) పతాకాన్ని కప్పి నాయకులు నివాళులు అర్పించారు.
వివరాలలోకి వెళ్లితే…
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఆళ్ల హనుమంతరావు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత లోకి వెళ్లిన సంఘటన ఉదయం సుమారు 7 గంటల సమయంలో జరిగింది. ఈ సంఘటన ఒక్కసారిగా పెద్ద బీరవల్లి గ్రామాన్ని, కుటుంబ సభ్యులను, సిపిఎం నాయకులను, కార్యకర్తలను విషాదంలోకి ముంచింది.



