Saturday, May 16, 2026
E-PAPER
Homeసోపతిసెల్యూట్‌ సుందరయ్య

సెల్యూట్‌ సుందరయ్య

- Advertisement -

సెల్యూట్‌ సుందరయ్య.. రెడ్‌ సెల్యూట్‌ చల్లనయ్య.. సెల్యూట్‌ అందరయ్య.. శ్రమజీవుల తండ్రివయ్య.. నీ పేరు వినగానే పోరాటాల చరిత్ర గుండెల్లో మోగుతుంది.. నిన్ను తలుచుకుంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది.. నిస్వార్థానికి రూపం.. త్యాగానికి ప్రతిరూపం.. నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిర్వచనం నీవు.. తెల్లటి ఖద్దరు దుస్తుల్లో కనిపించినా.. నీ ఆలోచనలు అగ్నిజ్వాలలు.. నీ అడుగులు ఉద్యమాల దిక్సూచులు.. నీ జీవితం ప్రజా రాజకీయాల పాఠశాల.. ప్రజలే ప్రాణంగా.. ఉద్యమమే ఊపిరిగా.. ఆశయాలే జీవన గీతగా చివరి శ్వాస వరకు నడిచిన మహానేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య. ఈ రోజు ఆయన 41వ వర్ధంతి. ఇది కేవలం ఓ మహానేతను స్మరించుకునే రోజు కాదు.. రాజకీయాల అసలు అర్థాన్ని గుర్తు చేసుకునే రోజు.. సేవ, త్యాగం, నిబద్ధత, నిజాయితీ అనే విలువలను మళ్లీ మనసులో నిలబెట్టుకునే సందర్భం.

నేటి రాజకీయాల్లో ప్రచారం పెరిగింది కానీ ప్రజల పట్ల బాధ్యత తగ్గిపోయింది. పదవులు పెరిగాయి కానీ విలువలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి సమయంలో సుందరయ్య జీవితం ఒక వెలుగుదీపంలా కనిపిస్తుంది. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల పక్షాన నిలిచిన నాయకుడు. 1913 మే 1న నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. చిన్న వయసులోనే సమాజంలోని అసమానతలను గమనించిన ఆయన కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ తన పేరులోని ‘రెడ్డి’ అనే కులసూచికను తొలగించుకున్నారు. ఆరేండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన జీవితం కష్టాల మధ్య సాగింది. వీధిబడిలో ప్రాథమిక విద్య పూర్తిచేసి తిరువళ్లూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసుల్లో చదువుకున్నారు. విద్యార్థి దశలోనే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, కొమర్రాజు లక్ష్మణరావు వంటి సంఘ సంస్కర్తల ప్రభావం ఆయనపై పడింది.

చదువుతో పాటు ఉద్యమాల వైపు
మహాత్మాగాంధీ పిలుపుతో స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులైన సుందరయ్య, చిన్న వయసులోనే సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. లయోలా కళాశాలలో చదువుతున్న రోజుల్లో ”సోదర సమితి” ఏర్పాటు చేసి యువతలో దేశభక్తి, సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారు. ఖద్దరు అమ్మడం, గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు చదువు చెప్పడం, అస్పశ్యత నిర్మూలన కోసం పనిచేయడం ఆయన జీవితంలో భాగమయ్యాయి. వేమన జయంతి సందర్భంగా దళితులతో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి ఛాందసవాదానికి సవాల్‌ విసిరారు. 1930లో గాంధీజీ పిలుపుతో చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగారు. భీమవరంలోని సత్యాగ్రహ శిబిరంలో చేరి జైలు జీవితం గడిపారు. విడుదలైన తర్వాత గ్రామాల్లో తిరుగుతూ వ్యవసాయ కార్మికులను సంఘటితం చేశారు. బ్రిటిష్‌ పాలన వెళ్లిపోవడం మాత్రమే స్వాతంత్య్రం కాదని వర్గ దోపిడీ, పేదరికం, అసమానతలు అంతమయ్యే సమాజమే నిజమైన స్వాతంత్య్రమని ఆయన గట్టిగా విశ్వసించారు. ఆ ఆలోచనే ఆయనను కమ్యూనిస్టు భావజాలం వైపు నడిపించింది.

కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి అజరామర సేవలు
కామ్రేడ్‌ అమీర్‌ హైదర్‌ ఖాన్‌ మార్గదర్శకత్వంలో కమ్యూనిస్టు పార్టీలో చేరిన సుందరయ్య దక్షిణ భారతదేశంలో పార్టీ నిర్మాణానికి జీవితాన్ని అంకితం చేశారు. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమ విస్తరణకు కీలకంగా పనిచేశారు. 1936లో అఖిల భారత కమ్యూనిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. అఖిల భారత కిసాన్‌ సభ స్థాపనలో కీలకపాత్ర పోషించి రైతాంగ ఉద్యమాలకు బలమైన పునాది వేశారు. ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు వేల మైళ్ల రైతు రక్షణ యాత్ర చేపట్టి రైతుల్లో చైతన్యం నింపారు.

తెలంగాణ సాయుధ పోరాటానికి మార్గదర్శి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సుందరయ్య జీవితంలో అత్యంత చారిత్రాత్మక అధ్యాయం. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల వెట్టిచాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ”దున్నేవాడికే భూమి” నినాదంతో రైతాంగాన్ని సమీకరించారు. 1946 నుంచి 1951 వరకు సాగిన పోరాటంలో అజ్ఞాత జీవితం గడిపినా ఆశయాలను విడిచిపెట్టలేదు. రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు. వేలాది మంది యోధుల త్యాగాలతో సాగిన ఆ పోరాటం నిజాం రాచరికాన్ని కుదిపేసింది. ఆ ఉద్యమ అనుభవాలతో ఆయన రాసిన ”వీర తెలంగాణ విప్లవ పోరాటం- గుణపాఠాలు” గ్రంథం ఇప్పటికీ ఉద్యమకారులకు మార్గదర్శకం.

ఉద్యమానికే ప్రాధాన్యం
1943 ఫిబ్రవరి 27నలో లీలమ్మను వివాహం చేసుకున్న సుందరయ్య ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. లీలా కూడా పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా మారారు. పిల్లలు పుడితే ప్రజాసేవకు ఆటంకం కలగవచ్చని భావించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడం వారి త్యాగనిరతికి నిదర్శనం. ”ప్రజలే నా కుటుంబం” అన్న భావనతో జీవితాంతం ప్రజల మధ్యే జీవించారు. తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని పేదలకు పంచిపెట్టి ప్రజా ఉద్యమాల నిర్మాణానికి వెచ్చించారు.

ప్రజా ప్రతినిధిగా ఆదర్శం
1952 సాధారణ ఎన్నికల తర్వాత సుందరయ్య మద్రాస్‌ అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. తర్వాత 1955 నుంచి 1967 వరకు తిరిగి 1978 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా సేవలందించారు. పార్లమెంట్‌కు, అసెంబ్లీకి సైకిల్‌పైనే వెళ్లేవారు. పార్లమెంట్‌ భవనంలో ఉద్యోగుల సైకిళ్ల మధ్య ఆయన సైకిల్‌ కనిపించేది. పదవులను అధికార ప్రదర్శనగా కాకుండా ప్రజాసేవకు వేదికగా ఉపయోగించారు. సభల్లో వాస్తవాలు, గణాంకాలతో మాట్లాడి ప్రభుత్వాలను నిలదీశారు. రైతాంగం, కార్మికులు, పేదల సమస్యలపై నిరంతరం పోరాడారు.

ఆలోచనాపరుడు.. రచయిత.. మార్గదర్శి
సుందరయ్య కేవలం ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు గొప్ప ఆలోచనాపరుడు కూడా. ”విశాలాంధ్రలో ప్రజారాజ్యం”, ”వీర తెలంగాణ విప్లవ పోరాటం — గుణపాఠాలు”, ”ఆత్మకథ” వంటి రచనల ద్వారా రాజకీయ చైతన్యానికి దారులు చూపించారు. తన ఆత్మకథలో ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకీ మార్గదర్శకమే:
”నాయకులు కదిలితే చాలదు.. ప్రజలు కదలాలి. ప్రజల్లో చైతన్యం పెరగాలి. దానికి నిరంతరం కషి చేయాలి” అంటారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం.. ప్రజా చైతన్యానికి నిలయం
1985 మే 19న మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో సుందరయ్య కన్నుమూశారు. కానీ ఆయన ఆశయాలు మరణించలేదు. హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ రోజు కూడా ప్రజా చైతన్యానికి వేదికగా నిలుస్తోంది. గ్రంథాలయం, సాంస్కతిక కార్యక్రమాలు, ప్రజా చర్చలు, సామాజిక ఉద్యమాలకు అది చిరునామాగా మారింది. అలాగే గచ్చిబౌలిలోని విజ్ఞాన కేంద్రం కూడా నేటి యువతకు అవసరమైన అధ్యయనాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంది.

యువతకు దిక్సూచి
డబ్బు, కులం, మతం, కార్పొరేట్‌ ప్రభావం రాజకీయాలను శాసిస్తున్న ఈ కాలంలో సుందరయ్యలాంటి నాయకుల అవసరం మరింత పెరిగింది. రాజకీయాలు సేవ నుంచి వ్యాపారంగా మారుతున్న వేళ ఆయన జీవితం యువతకు ఒక పాఠశాల కావాలి. యువత ఉద్యోగాలకే పరిమితం కాకూడదు. సమాజం కోసం ఆలోచించాలి. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలి. కుల, మత విద్వేషాలకు అతీతంగా మానవత్వం కోసం నిలబడాలి. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించే కొత్త నాయకత్వం సమాజానికి అవసరం. సుందరయ్య యువతకు ఇచ్చిన సందేశం ఒక్కటే ‘రాజకీయాలు అంటే అధికారం కాదు- బాధ్యత. నాయకత్వం అంటే ప్రచారం కాదు – ప్రజల కోసం నిలబడటం. ప్రజాసేవ అంటే మాటలు కాదు – త్యాగం”. సుందరయ్యను కేవలం జయంతులు, వర్ధంతులకు పరిమితం చేస్తే సరిపోదు. ఆయన కలలు కన్న సమసమాజ నిర్మాణం కోసం కషి చేయడమే నిజమైన నివాళి. ప్రజల పక్షాన నిలబడటం.. ప్రజా పోరాటాల్లో భాగమవడం.. సామాజిక న్యాయం కోసం నడవడం.. అదే కామ్రేడ్‌ సుందరయ్యకు అసలైన రెడ్‌ సెల్యూట్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -