నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ సమీపానికి అమెరికా భారీ యుద్ధ నౌకాదళాన్ని తరలిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ, తమపై ఎలాంటి దాడి జరిగినా దానిని పూర్తిస్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని గట్టిగా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు. “భారీ సంఖ్యలో మా యుద్ధనౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా. ముందుజాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆయన తెలిపారు.
ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక నేతృత్వంలోని బృందం మధ్యప్రాచ్యం వైపు వస్తోంది. ఈ బృందంలో యూఎస్ఎస్ మెక్‌ఫాల్, యూఎస్ఎస్ మిట్‌స్చెర్ అనే రెండు డిస్ట్రాయర్లు, మూడు యుద్ధ నౌకలు, ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై ఎలాంటి దాడి జరిగినా, అది చిన్నదైనా పెద్దదైనా, దాన్ని సంపూర్ణ యుద్ధంగానే పరిగణిస్తామని ఓ సీనియర్ ఇరాన్ అధికారి హెచ్చరించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ మహ్మద్ పాక్‌పూర్ మాట్లాడుతూ.. “మా దళాలు గతంలో కంటే అత్యంత అప్రమత్తంగా, వేలు ట్రిగ్గర్‌పైనే ఉంచి సిద్ధంగా ఉన్నాయి” అని స్పష్టం చేశారు.



