ఆదేశించినా ఆగని కోతలు
క్వింటాకు 20 కేజీల ధాన్యం తరుగు..
ఒప్పుకుంటేనే దింపుకుంటున్న మిల్లర్లు
ట్రక్ షీట్స్‌లో కనిపించని కటింగ్స్
ప్రభుత్వ ఆదేశాలనూ లెక్క చేయని మిల్లర్లు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాకు 2 కేజీలకు మించి కోతలు విధించవద్దని ఆదేశాలు ఇస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. క్వింటాకు 10 – 20 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. లేదంటే ధరలో కోత విధిస్తున్నారు. క్వింటా ఏ గ్రేడ్ రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,389 ఉంది. సాధారణ రకానికి రూ.2,369 నిర్ధారించారు. కానీ మిల్లర్లు క్వింటా ధాన్యం రూ.1,950 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కోతకు అంగీకరిస్తేనే కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. విషయం బయటకు పోక్కకుండా రైతులను హెచ్చరిస్తున్నారు. కనీసం ట్రక్ షీట్‌ను కూడా చూపించేందుకు రైతులు భయపడుతున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఇదే తంతు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల, తల్లాడ తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లలో కోతలు అధికంగా ఉన్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పండిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 152 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉండగా, అందులో 90 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ మిల్లర్ల ఆగడాలను నియంత్రించి రైతులకు మేలు చేసే చర్యలు లేకపోవడంపై విచారం వ్యక్తం అవుతోంది. లారీలు, హమాలీల కొరత కారణంగా రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందనే భయాందోళనతో రైతులే మిల్లర్లు సూచించిన విధంగా కోతలకు అంగీకరిస్తూ ట్రక్ షీట్లను ఐకేపీ సిబ్బందితో రాయిస్తుండటం గమనార్హం.
ట్రక్ షీట్‌లో కనిపించని కోతలు..
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లారీ, ట్రాక్టర్ ట్రక్ షీట్‌లలో రైస్ మిల్లుల వద్ద విధించే అక్రమ కోతలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రక్ షీట్‌పై సరైన తూకం కాకుండా మిల్లర్లు సూచించిన బరువునే సంబంధిత రైతులు ఐకేపీ అధికారులతో రాయిస్తున్నారు. కొన్నిచోట్ల ఆన్‌లైన్ ట్రక్ షీట్ జనరేట్ చేసినా, మిల్లుల వద్ద అదనపు బరువు కోసం మ్యాన్యువల్ రశీదు లను వాడుతూ, అక్రమ కోతలకు పాల్పడు తున్నారనే ఆరోపణలు సైతం ఇటీవల కొన్ని జిల్లాల్లో వచ్చాయి. ఒకే లారీకి వేర్వేరు ట్రక్ షీట్లు సృష్టించి రైతులకు నష్టం కలిగించిన ఉదంతాలూ వెలుగు చూశాయి. కొనుగోలు కేంద్రంలో లారీ, ట్రాక్టర్లు లోడ్ చేసేటప్పుడు, మిల్లు వద్ద అన్‌లోడ్ చేసేటప్పుడు బరువులో తేడాలు చూపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాకు 2 కిలోల వరకు కోత అనుమతించినా.. అంతకంటే ఎక్కువ కోత పెడుతున్నారు.
మిల్లర్లు చెప్పిందే వేదం
మిల్లర్లు చెప్పిందే వేదం అన్నట్టుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. ధాన్యం విపరీతంగా దిగుబడి రావడంతో మిల్లుల సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాము చెప్పిన విధంగా రైతులు నడుచుకుంటేనే కొనుగోలు చేస్తామనే రీతిలో మిల్లర్ల వ్యవహార శైలి ఉంది. గత్యంతరం లేని స్థితిలో రైతులు కూడా మిల్లర్లు పెట్టే షరతులకు అంగీ కరిస్తున్నారు. లేదంటే స్థానిక మిల్లులు కొనుగోలు చేయడం లేదు. దూర ప్రాంతాల్లో తమకు కేటాయించిన మిల్లులకు వెళ్ళి రోజుల తరబడి వేచి ఉండటం కన్నా స్థానిక మిల్లులకు అమ్ముకుంటే రవాణా, వెయిటింగ్, తూకాల్లో కలిసి వస్తాయని రైతులు మిల్లర్లు పెట్టే కండిషన్స్‌కు ఒప్పుకుంటున్నారు. కేటాయించిన దూర ప్రాంత మిల్లులకు ధాన్యం తరలించే క్రమంలో ఐదారుగురు రైతుల వడ్లను లారీకి లోడ్ చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్క రైతు ధాన్యం నాసిరకంగా ఉన్నా.. నాణ్యతా పరీక్షలో మిగిలిన రైతులు కూడా నష్టపోవాల్సి ఉంటుం ది. ఈ తతంగమంతా ఎందుకని రైతులు మిల్లర్లు పెట్టే కోతలకు అంగీకరిస్తున్నారు. ఈ మేరకు రైతులే దగ్గరుండి ఐకేపీ అధికారులతో ట్రక్ షీట్‌లోనూ తూకాలను తారుమారు చేయించి రాయిస్తున్నారు.
20 కేజీల తరుగుకు ఒప్పుకోక తప్పని స్థితి
కొణిజర్ల మండలం పెద్ద మునగాలకు చెందిన కొందరు రైతులు వైరాలోని ఓ రైస్ మిల్‌కు ధాన్యం ఎత్తారు. ఆ రైస్ మిల్లర్ సూచన మేరకు క్వింటాకు 20 కేజీలు తగ్గించుకొని.. ట్రక్ షీట్ రాయించి మరీ తరలించారు. సంబంధిత రైతులను ‘నవతెలంగాణ’ ప్రశ్నించగా.. కనీసం వారి పేరు చెప్పేందుకు కూడా సంకోచించారు. ”ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు ఓ ప్రహసనంగా మారాయి. కాబట్టి నష్టమో..! లాభమో..!! పంటను అమ్ముకొని తీరాలి కాబట్టే మిల్లర్ ఏ కండిషన్ పెడితే దానికి అంగీకరిం చాం’ అని వాపోయారు. తమ పేర్లు పత్రికల్లో రాయొద్దని వేడుకున్నారు. ఎందుకంటే తాము మరో ప్రాంతానికి వెళ్లి.. రోజుల తరబడి ఎదురు చూసి వడ్లు అమ్ముకోలేమని చెప్పుకొచ్చారు. చేసేది లేక ఐకేపీ సిబ్బంది కూడా రైతుల సూచన మేరకు ట్రక్ షీట్లు సిద్ధం చేస్తున్నారు.



