నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది సినీ రంగానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ (మరణానంతరం) లభించగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను గౌరవిస్తూ కేంద్రం ఈ జాబితాను విడుదల చేసింది. పద్మ విభూషణ్ పురస్కారానికి మొత్తం ఐదుగురిని ఎంపిక చేయగా, వారిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్‌కు కూడా మరణానంతరం ఈ గౌరవాన్ని ప్రకటించారు.
ఇక పద్మ భూషణ్ పురస్కార గ్రహీతల్లో ప్రఖ్యాత గాయని అల్కా యాగ్నిక్, తెలుగు వారికి సుపరిచితులైన క్యాన్సర్ వైద్య నిపుణులు, ఎన్నారై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఝార్ఖండ్ మాజీ సీఎం షిబు సోరెన్‌కు మరణానంతరం పద్మ భూషణ్ ప్రకటించారు.



