– నన్ను గెలిపించండి.. అండగా ఉంటా :సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు
– జగన్నాధపురంలో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-పాల్వంచ
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప, ఈ పదేండ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్, సీపీఐ(ఎం), టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ(ఎంఎల్-ప్రజాపంథా) బలపరిచిన కొత్తగూడెం నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజల పక్షాన సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని, ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కొంతమంది నాయకులు తాము అభివృద్ధి చేశామంటే తాము అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మాయబుచ్చేందుకు తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్, సీపీఐ కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేక గ్రాంట్లు ద్వారా నిధులను తీసుకొస్తే, తాజా, మాజీ ప్రతినిధులు వాటి నిధులను మళ్లించి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. ఐదేండ్ల పాటు ప్రజలను, వారి కష్టాలను పట్టించుకోని నాయకులు డబ్బు మూటలతో వస్తున్నారని వారి ఆటలు కొనసాగకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, జన సమితి నాయకులు కోత్వాల శ్రీనివాస్ రావు, జానకి రెడ్డి, ఎర్రం శెట్టి ముత్తయ్య పాల్గొన్నారు.