నవతెలంగాణ-హైదరాబాద్: వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయిల్ స్థిరనివాసుల హింసాత్మక దాడుల్లో గడిచిన రెండు వారాల్లో దాదాపు వంద పాలస్తీనియన్ కుటుంబాలు నిరాశ్రయులైనట్లు నివేదిక పేర్కొంది. ప్రభావితమైనవారిలో అధికశాతం మంది జెరిఖో గవర్నరేట్‌లోని రాస్ ఐన్ అల్-అవుజాకు చెందిన బెడౌయిన్లని, అదే సమయంలో ఐదు ఇతర వెస్ట్‌బ్యాంక్ కమ్యూనిటీలు బలవంతంగా స్థానభ్రంశం చెందాయని తెలిపింది. ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఒసిహెచ్ఎ) సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది.
రాస్ ఐన్ అల్-అవుజా ప్రాంతంలో స్థిరపడిన ఇజ్రాయిల్ కుటుంబాలు పాలస్తీనియన్లపై అమానుషంగా వ్యవహరించినట్లు నివేదిక తెలిపింది. రాత్రిపూట దాడులకు, బెదిరింపులకు దిగడం, దుర్భాషలాడటంతో పాటు ఇళ్లను కూల్చివేసాయని, దీంతో 77పాలస్తీనియన్ కుటుంబాలు నిరాశ్రయులైట్లు పేర్కొంది. ఈ కుటుంబాల్లో 186మంది మైనర్లు, 91మంది మహిళలతో కలిపి మొత్తం 375మంది వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించింది.
జనవరి 8న 110మందితో కూడిన 21కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారని, ఆ సమయంలో ఒక వృద్ధుడిపై భౌతికంగా దాడికి దిగడంతో పాటు సోలార్ పవర్ కేబుల్స్‌ను విధ్వంసం చేశారని పేర్కొంది. శుక్రవారం నబ్లస్ నగరానికి దక్షిణాన ఉన్న వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న రైతుపై ఇజ్రాయిల్ బృందాలు కాల్పులు జరిపాయని, అతను మరణించాడని తెలిపింది. దాడి సమయంలో అంబులెన్స్ ఆ ప్రదేశానికి రాకుండా ఇజ్రాయిల్ బృందాలు అడ్డుకున్నాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ పేర్కొంది. గత వారం ఇజ్రాయిల్ దళాలు బెత్లెహామ్‌కు దక్షిణంగా ఉన్న బీట్ ఫజ్జార్ పట్టణంపై జరిపిన దాడిలో 12మంది పాలస్తీనా పౌరులను అదుపులోకి తీసుకున్నాయని తెలిపింది.



