నవతెలంగాణ-హైదరాబాద్: ఆటోలు, కలప మరియు ఫార్మాన్యూటికల్స్ సహా దక్షిణ కొరియా వస్తువులపై సుంకాలు పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న గత వాణిజ్య ఒప్పందానికి అనుగుణంగా దక్షిణ కొరియా వ్యవహరించడం లేదని ఆరోపించారు. తాజా పెంపుతో ఆ దేశంపై సుంకాలు 15శాతం నుండి 25శాతానికి చేరనున్నాయి. వారి ప్రత్యేక హక్కు అయిన మా చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని దక్షిణ కొరియా శాసనసభ అమలు చేయడం లేదని తన సోషల్ మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు.
టారిఫ్‌ల పెంపు గురించి ముందస్తుగా తమకు తెలియదని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం కెనడాలో ఉన్న వాణిజ్య మంత్రి కిమ్ జంగ్-క్వాన్, అమెరికా వాణిజ్య కార్యదర్వి హోవార్డ్ లుట్నిక్‌తో ఈ అంశంపై చర్చలు జరిపేందుకు వాషింగ్టన్ వెళ్లనున్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా మరియు దక్షిణ కొరియా వాణిజ్యం మరియు భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్న కొన్ని నెలల తర్వాత, ఉద్రిక్త చర్చలు ముగిసిన అనంతరం ట్రంప్ నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
గతేడాది అక్టోబర్‌లో ట్రంప్ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యూంగ్‌తో సమావేశమైన తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. అమెరికా సుంకాల తగ్గింపులతో పాటు దక్షిణకొరియా పెట్టుబడి వాగ్దానాలను కూడా చేర్చింది. అయితే ఈ ఒప్పందానికి దక్షిణకొరియాలో చట్టపరమైన అవరోధం ఎదురవుతోంది. అమెరికాకు దక్షిణకొరియా ఎగుమతుల్లో ఆటో పరిశ్రమ 27శాతం వాటాను కలిగి ఉంది. ఇది దేశం యొక్క కార్ల ఎగుమతుల్లో సుమారు సగం ఉంటుంది.



