నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక విషయాలను వెల్లడించింది. ‘పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదు. రన్‌వే గుర్తింపులో పైలట్లు ఇబ్బంది పడ్డారు. తొలి ప్రయత్నంలో రన్‌వే కనిపించకపోవడంతో.. కాసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. రెండోసారి ల్యాండ్ అయ్యేందుకు యత్నించి విఫలమయ్యారు. కొద్దిసేపటి తర్వాత, రన్‌వే-11 ప్రవేశద్వారం దగ్గర మంటలు కనిపించాయి. రన్‌వే ఎడమ వైపున ప్రవేశద్వారం దగ్గర విమాన శిథిలాలు కనిపించాయి’ అని డీజీసీఏ వెల్లడించింది. ఆపదలో ఉన్నప్పుడు పైలట్ల నుంచి మేడే కాల్ అనేది వస్తుంది.
ఇక ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో వెలుతురు సమస్యే కారణమని వెల్లడైనట్లు ఆయన తెలిపారు. విమాన ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. పవార్‌తో పాటు, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, ఇద్దరు పైలట్లు.. సుమిత్ కపూర్, శాంభవి పాఠక్, ఒక ఫ్లైట్ అటెండెంట్ ఈ ప్రమాదంలో మరణించారు.



