– ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన మహాధర్నా
– సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా చేపట్టిన బదిలీలను ఆపాలి
– రెండేండ్ల కనీస నిబంధనను వెంటనే మార్చాలి
– తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
– చర్చలకు పిలిచి… ముఖం చాటేసిన సీఎండీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ చేసే ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు బుధవారం హైదరాబాద్‌లోని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)ను ముట్టడించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక (టీఈఈజేఏసీ, టీజీపీఈజేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా ఉద్యోగులు తరలి వచ్చి మహా ధర్నా చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎస్పీడీసీఎల్ సీఎండీ మొండి వైఖరి నశించాలనీ, బదిలీల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనీ, రెండేండ్లకు కుదించిన కనీస కాలపరిమితిని మూడేండ్లకు మార్చాలనీ, వెంటనే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, జెండాలు, పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడాన్ని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థుల పరీక్షలు జరుగుతున్న ఈ సమయంలో బదిలీలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఏక పక్షంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో పిల్లల విద్యాభ్యాసానికి విఘాతం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరి బదిలీకి ఉన్న కనీస సర్వీస్ రెండేండ్ల స్థానంలో మూడేండ్లకు సవరించాలనీ, బదిలీ నిబంధనలు ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జారీ చేయాలన్నారు. కొంత మంది అవినీతి అధికారులు తమ స్థార్థం కోసం ఈ దందాకు తెరతీసారని విమర్శించారు. గతంలో మాదిరిగానే విద్యా సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుని వేసవిలో బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు సాయిబాబు, జాన్సన్, నలువాల స్వామి, రత్నాకర్, శివాజీ, గోవర్దన్, శ్రీధర్, బీసీ రెడ్డి, పీ.అంజయ్య, శ్యామ్ మనోహర్, వెంకన్న గౌడ్, సుధాకర్ రెడ్డి, మేడి రమేష్, శెట్టి, నాసర్ షరీఫ్, మాతంగి శ్రీనివాస్, గోవర్ధన్, నాగరాజు, కరుణాకర్ రెడ్డి, ఎస్.చంద్రారెడ్డి, సదానందం, నెహ్రూ నాయక్, నారాయణ నాయక్, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, అక్బర్, భాను ప్రకాష్, కరెంట్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ముఖం చాటేసిన సీఎండీ
బదిలీలకు సంబంధించి విద్యుత్ సంస్థలు షెడ్యూల్ విడుదల చేయగానే ఉద్యోగ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రాలు అందిం చాయి. వారి వినతులను పరిగణలోకి తీసుకో కుండా విద్యుత్ సంస్థలు ముందుకెళ్లాయి. దాంతో ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈనెల 28న ఎస్పీడీసీఎల్ ముందు ధర్నాకు పిలుపునిచ్చాయి. పరిస్థితిని గమనించిన ఎస్పీడీసీఎల్ యాజమాన్యం బుధవారం చర్చలకు రావాలని కోరింది. ఉదయం ఒక వైపు ఆందోళన జరుగుతుండగానే జేఏసీ నేతలు చర్చలకు వెళ్లారు. అయితే చర్చలకు పిలిచిన సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ఉందనే సాకుతో ముఖం చాటేశారు. దాంతో చర్చలు సఫలం కాలేదు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా స్థలికి చేరుకున్న జేఏసీ నేతలు ఆందోళనను కొనసాగించారు.
వివాదం ఇలా…
ప్రతి ఏటా విద్యుత్ సంస్థల్లో ఏప్రిల్‌లో షెడ్యూల్ విడుదల చేసి మేలో బదిలీ ఉత్తర్వులిస్తారు. ఏపీఎస్ఈబీ సంస్థ పుట్టినప్పటి నుంచి దాదాపు 60 ఏండ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. గతానికి భిన్నంగా 2025-2026 సంవత్సరానికి రాష్ట్ర, జోనల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీలకు సంబందించి మార్గదర్శకాలను ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. దానికనుగునంగా ఎస్పీడీసీఎల్ బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి, ఆప్షన్లు పెట్టుకోవాలని ఉద్యోగులకు సూచించింది. జెన్కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్ లో సైతం అదే విధానాన్ని అవలంభించాలని నిర్ణయిం చాయి. ఈ క్రమంలోనే ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్ని విద్యుత్ సంస్థల సీఎండీలతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టిని కలిసి బదిలీలు ఆపాలని విన్నవిం చాయి. అయితే చివరి వరకు ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు తెరతీశారు.
ఎస్పీడీసీఎల్ను ముట్టడించిన ఉద్యోగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



