నవతెలంగాణ-హైదరాబాద్: టెహ్రాన్‌పై అమెరికా బలప్రయోగానికి పాల్పడితే చాలా ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయని.. పశ్చిమాసియా అంతటా గందరగోళానికి కారణమవుతుందని రష్యా హెచ్చరించింది. అమెరికా-ఇరాన్‌లు ఇంకా చర్చించుకునే అవకాశం ఉందని రష్యా సూచించింది.
ఇరాన్ చర్చలకు వచ్చి అణ్వాయుధాలపై ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా అమెరికా దాడి చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. ఈ సందర్భంగా డిమిత్రీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సమస్యల్ని పరిష్కరించడానికి అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. బలప్రయోగాన్ని మానుకోవాలని మేము పిలుపునిస్తూనే ఉన్నాము. చర్చల విధానాలపైనే దృష్టి పెట్టాలి. బలవంతపు చర్యలు ఈ ప్రాంతంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రాంతం అంతటా భద్రతా వ్యవస్థను అస్థిరపరిచే పరంగా చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి’ అని ఆయన అన్నారు.
కాగా, ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. జనవరి 2025లో ఇస్లామిక్ రిపబ్లిక్‌తో 20 సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది.



