Sunday, May 25, 2025
Homeఅంతర్జాతీయంనిన్న యాపిల్‌.. నేడు శామ్‌సంగ్‌

నిన్న యాపిల్‌.. నేడు శామ్‌సంగ్‌

- Advertisement -

భారత్‌లో ఫోన్‌ తయారు చేస్తే టారిఫ్‌ తప్పదు : ట్రంప్‌ హెచ్చరిక
ఓవల్‌ : భారత్‌లో తయారైన ఐఫోన్లను అమెరికాలో ఎక్కడ విక్రయించినా ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానని యాపిల్‌ కంపెనీని హెచ్చరించిన కొన్ని గంటలకే దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శామ్‌సంగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. శామ్‌సంగ్‌ సహా అమెరికా వెలుపల తయారయ్యే ఏ కంపెనీ ఫోన్‌ అయినా వాటికి టారిఫ్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఓవల్‌ కార్యాలయం వెలుపల ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘మరిన్ని కంపెనీలూ సుంకాలు చెల్లించాల్సిందే. అది శామ్‌సంగ్‌ కావచ్చు. ఐఫోన్‌ను ఉత్పత్తి చేసే మరో కంపెనీ కావచ్చు. ఆ కంపెనీలు తమ ఫోన్లను ఇక్కడ తయారు చేస్తే సుంకం ఉండదు’ అని చెప్పారు. యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌కు సుంకాల విషయాన్ని గతంలోనే చెప్పానని ట్రంప్‌ అంతకుముందు అన్నారు. ‘అమెరికాలో విక్రయించే మీ ఐఫోన్లు ఇక్కడే తయారు కావాలని, అంతే కానీ భారత్‌లోనో మరో చోటో తయారైతే సుంకాలు విధించక తప్పదని చాలాకాలం క్రితమే ఆయనకు తెలిపాను. ఒకవేళ వేరే దేశంలో ఐఫోన్‌ను తయారు చేస్తే యాపిల్‌ కంపెనీ కనీసం 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. యాపిల్‌ కంపెనీ భారత్‌కు వెళ్లి అక్కడ ప్లాంట్లు నిర్మిస్తే తనకేమీ అభ్యంతరం లేదని, అయితే అది టారిఫ్‌ లేకుండా అమెరికాలో తన ఉత్పత్తులను అమ్మలేదని ఓవల్‌ కార్యాలయం వద్ద ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘ప్లాంట్లు నిర్మించడానికి భారత్‌ వెళతానని టిమ్‌ చెప్పారు. ఆయన భారత్‌ వెళితే ఓకే. కానీ మీరు టారిఫ్‌ లేకుండా ఇక్కడ ఐఫోన్లను అమ్మలేరు’ అని ట్రంప్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -