నవతెలంగాణ-హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవులను వేగంగా భారీ కార్చిచ్చు దహించేస్తోంది. దీంతో అప్రమతమైన రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి మంటలు సమీపంలోని గ్రామాల వైపు వ్యాపించకుండా ‘ఫైర్ లైన్లను’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, బలమైన గాలుల వల్ల మళ్లీ ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 9,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి నీటిని చల్లుతోంది. ముఖ్యంగా భారత వైమానిక దళానికి చెందిన Mi-17V5 హెలికాప్టర్లు హిమాలయ పర్వత శ్రేణులలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల మధ్య దాదాపు ఇప్పటి వరకు 12 వేల లీటర్ల నీటిని మంటలపై కురిపించాయి. లోహిత్ వ్యాలీలోని దుర్భరమైన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా భూమిపై ఉన్న సిబ్బంది మంటల వద్దకు చేరుకోవడం కష్టతరంగా మారడంతో ఈ గగనతల ఆపరేషన్ చేపట్టారు.
నాగాలాండ్‌లోనూ..
కాగా, ఇదే సమయంలో నాగాలాండ్‌లోని ప్రసిద్ధ జుకో వ్యాలీలో కూడా కార్చిచ్చు చెలరేగింది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన సుమారు 30 మంది పర్యాటకులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. తీవ్రమైన చలికాలపు పొడి వాతావరణం, ఎండుగడ్డి, బలమైన గాలుల కారణంగా ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.



