నవతెలంగాణ – తిరుమలగిరి : తిరుమలగిరి మండలం చింతలకుంట తండా గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్ షేక్ చాంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం మూడవ రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ డాక్టర్ వెంకట రమణా రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు సేవా భావాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులను పూజిస్తూ, ఉపాధ్యాయులను గౌరవిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. సామాజిక కార్యక్రమాల ద్వారా శ్రమ విలువ, బాధ్యతాయుతమైన జీవన విధానం, సమాజంతో మెలగాల్సిన తీరు స్పష్టంగా అవగాహనకు వస్తుందని తెలిపారు. ఎన్ఎస్ఎస్ శిబిరంలో విద్యార్థులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ వారిని అభినందించారు.
అనంతరం తిరుమలగిరి మండల విద్యాధికారి శాంతయ్య మాట్లాడుతూ, ఇలాంటి సామాజిక కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సమతాభావన, సహకార భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. శ్రమదానం ద్వారా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని కళాశాలకు మంచి పేరు తేవాలని సూచించారు.గ్రామ సర్పంచ్ రవి మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు సమాజంపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి విద్యార్థులు చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ షేక్ చాంద్ , వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి కిరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుందర్, డాక్టర్ హరీష్ , ఉపాధ్యాయులు జగన్ నాయక్, రాజు, నిర్మల, గ్రామస్తులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



