నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు చరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIDMK) ఏన్డీయే కూటమితో కలిసిపోయింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ మిత్ర పక్షాలతో పోటీ చేస్తామని AIDMK ముఖ్యనేతలు స్పష్టం చేశారు. అదే విధంగా అధికార పార్టీ, ద్రావిడ మున్నేట కజగం(DMK) కూడా తన వ్యూహాలకు పదును పెట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డీఎంకే పావులుకదుపుతుంది. జాతీయ పరంగా ఇండియా బ్లాక్‌కు పరోక్షంగా డీఎంకే మద్దతు తెలుపుతోంది. అయితే త్వరలో స్థానికంగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఎంపీ కనిమొళీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
ఈక్రమంలో తాజాగా శుక్రవారం తూత్తుకుడి మీడియా సమావేశంలో డీఎంకే ఎంపీ కనిమొళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఇరుపార్టీల ముఖ్యనేతల ద్వారా క్లారిటీ వస్తోందని, కీలక చర్చలు ముగిసిన తర్వాత రెండు పార్టీల భాగస్వామ్యంపై స్పష్టమైన సందేశం వస్తోందని ఆమె వెల్లడించారు.
తమిళనాడు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా డీఎంకేతో కలిసి పోటీ చేయడంపై సుముఖంగా ఉన్నట్లు సమాచారం. జార్జండ్ రాష్ట్రంలో అనుసరించిన పంథానే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు అధినాయకత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని కోరిన కాంగ్రెస్ హైకమాండ్, మరోసారి పార్టీలోని వివిధ ప్రాంతాల నేతలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.



