నవతెలంగాణ-హైదరాబాద్: క్యూబాపై అమెరికా పరోక్షంగా బెదిరింపులకు దిగింది. క్యూబాకు చమురు విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. క్యూబాకు చమురును విక్రయించే లేదా అందించే దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధించబడుతుందన్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై గురువారం ట్రంప్ సంతకం చేశారు. క్యూబాకు చమురు అందిస్తూ, నిరంతరం సంఘీభావం ప్రకటిస్తున్న మెక్సికోపై ఈ ఉత్తర్వులు ఒత్తిడి తీసుకురానుంది.
ట్రంప్ ఉత్తర్వును క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ ఖండించారు. ఇది క్యూబా మరియు ఆ దేశ ప్రజలపై క్రూరమైన దురాక్రమణ చర్యగా పేర్కొన్నారు. ప్రాథమిక అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత ప్రభావం చూపనుందని అన్నారు. క్యూబాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఖండించబడిన దిగ్భందన పాలసీలోకి ఇతర దేశాలను చేరేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు అమెరికా బ్లాక్ మెయిల్ మరియు బెదిరింపులను ఆశ్రయించిందని అన్నారు.
దశాబ్దాలుగా తీవ్రమైన ఆర్థిక యుద్ధం వైఫల్యం చెందడంతో అమెరికా క్యూబాపై దిగ్బంధనానిన కఠినతరం చేస్తోందని మరియు సార్వభౌమాధికారం గల రాష్ట్రాలను ఆంక్షలలో చేరమని బెదిరింపులకు యత్నిస్తోందని క్యూబా విదేశాంగశాఖ ఉప మంత్రి కార్లోస్ ఎఫ్.డి.కోసియో ఎక్స్‌లో పేర్కొన్నారు. సుంకం బెరింపుల ముప్పుతో క్యూబాకు తమ సొంత చమురును ఎగుమతి చేసుకునే హక్కును వదులుకోవాలా వద్దా అని ఆయా దేశాలు నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు.



