కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం
బీఎల్‌ఏల సహకారంతో అందరి ఓటు హక్కును కాపాడతాం :
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్ పేరుతో గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ వారి ఓట్లు పోకుండా చూస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. బీఆర్‌ఎస్ తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) సహకారంతో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడుతామని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో పార్టీ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్ కేటీఆర్ నిర్వహించారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, సర్ అంశాలపైన పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా కేటీఆర్‌కు పార్టీ నాయకులు వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న సర్ విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని వివరించారు. పార్టీ ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్టు చెప్పారు. సర్ కోసం నియమించిన బీఎల్‌ఏల ద్వారా గల్ఫ్ లోని తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వారికి కేటాయించిన బూత్ పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి వారి ఓటు హక్కును ఎన్నికల కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. సర్ పేరుతో ఒక్క పౌరుడి ఓటు హక్కు తొలగించకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మోసాల వల్ల అనేక వర్గాల ప్రజలు తీవ్ర అసం తృప్తిలో ఉన్నారని బీఆర్‌ఎస్ నేతలు చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామనీ, రానున్న ఎన్నికల నాటికి తిరిగి జిల్లాలో బీఆర్‌ఎస్ పూర్తిగా స్వీప్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, పార్టీ సీనియర్ నేత సురేష్ రెడ్డితో పాటు జిల్లా సభ్యత్వ నమోదు ప్రధాన కార్యదర్శి గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



