ఉపాధి కూలీలతో ప్రతిజ్ఞ – తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ – ఉప్పునుంతల
విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లీ గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో ఉపాధి పని ప్రదేశం వద్ద ఉపాధి కూలీలతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ పథకం గ్రామీణ పేదలపై దాడి చేయడమేనని విమర్శించారు. ఎంజీఎన్‌రేగా చట్టం వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, పేద రైతులు, వృత్తిదారులకు హక్కుగా ఉపాధి కల్పిస్తోందని అన్నారు. పాత చట్టంలో వంద రోజుల పని ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదని, అలాంటప్పుడు కొత్త చట్టంలో 125 రోజులు కల్పిస్తున్నామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు.
నిధుల వాటా తగ్గించడం, రాష్ట్రాలపై అదనపు భారం మోపడం, పనుల నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవడం వంటి చర్యలతో ఉపాధి చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంజీఎన్‌రేగా పరిరక్షణకు ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా, ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కూలీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చీమర్ల లలిత సంఘీభావంగా మద్దతు తెలిపారు.



